హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అనేక విశేషాలు, అద్భుతాలు చోటుచేసుకొన్నాయి. దేవాలయ పనులను దక్కించుకోవడానికి చాలా మంది కాంట్రాక్టర్లు పోటీలు పడ్డారు. ప్రధాన ద్వారాన్ని చెక్కేందుకు దేశవ్యాప్తంగా టెండర్లను పిలిచారు. ఇందులో పలువురు పాల్గొన్నారు. రకరకాల నమూనాలు చూపించారు. చివరకు టెండర్లను ‘అనురాధా టింబర్స్’ వారు దక్కించుకున్నారు. 36 లక్షల విలువతో సప్తతల రాజగోపురం వద్ద 36 అడుగుల ఎత్తుతో నాణ్యమైన టేకు దర్వాజను తయారుచేసే కాంట్రాక్టును పొందారు. పనులు చేపట్టి దర్వాజ పూర్తిచేశారు. ఇక దేవాలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు.
అధికారులు అన్నిరకాల పరీక్షలు చేసి నిర్దేశించిన ప్రమాణాలతోనే దర్వాజ చేశారని ఫైనల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇక ఫైనల్ బిల్లును యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఇవ్వడమే ఆలస్యం. ఈ సమయంలో అనురాధా టింబర్స్ యజమాని దేవాలయం వద్దకు చేరుకొని ‘స్వామికి నా వంతుగా దర్వాజను ఉచితంగా అందజేస్తా’ అని ప్రకటించారు. యాదాద్రి నరసింహుడి నుంచి ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పడం గమనార్హం. స్వామి కటాక్షం ఉంటే చాలు.. తనకేమీ వద్దని చెప్పివెళ్లారు. దీంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయ్యింది. టెండర్లలో పాల్గొని, రేటు మాట్లాడుకొని బిల్లు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన కాంట్రాక్టర్.. చివరకు తనకు డబ్బులు వద్దని చెప్పడం విశేషం.