నిజామాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై అవినీతి నిరోధకశాఖ అధికారుల దాడులు రాజకీయంగా సెగ పుట్టిస్తున్నది. మల్లారెడ్డి స్వయానా కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి, కీలక నేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి సోదరుడు కావడం ఇటు ఎక్సైజ్ శాఖలో, అటు అధికార కాంగ్రెస్‌లో కాక రేపుతున్నది. మొదట్నుంచి కొమ్మూరి బ్రదర్స్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతాప్‌రెడ్డిని టార్గెట్ చేయడం కోసం ఆయన సోదరుడిని ముఖ్యనేత వర్గం టార్గెట్ చేసిందా? అన్న చర్చ మొదలైంది. గతంలో ఎమ్మెల్యేగా రెండు సార్లు చేర్యాల నుంచి గెలిచిన ప్రతాప్‌రెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. కొద్దికాలం డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. మరోసారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. పదవి రాకపోవడంతో అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు, సీఎం వర్గానికి దూరంగా ఉంటున్నారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలోనే తన సోదరుడిపై ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న కారణంగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కొమ్మూరి మల్లారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది.