రాజన్న సిరిసిల్ల, మే 3 (నమస్తే తెలంగాణ) : ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన బత్తుల విఠల్ (55) మరమగ్గాల కార్ఖానాలో జాఫర్(మెకానిక్)గా పనిచేస్తున్నాడు. భార్యశారద, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అప్పు చేసి పెద్ద కూతురు శ్రుతిని సిరిసిల్లలోని గణేశ్‌నగర్‌కు చెందిన ఓయువకుడితో వివాహం జరిపించాడు.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరెల ఆర్డర్లతో చేతినిండా పని లభించగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు బంద్ దీంతో ఏడాదిన్నర కాలంగా పనిలేకపోవడం, అప్పులు తీర్చే మార్గం లేక కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. శనివారం సాయంత్రం భార్య శారద.. చిన్న కూతురు భార్గవితో కలిసి గణేశ్‌నగర్‌లో ఉంటున్న పెద్ద కూతురు ఇంటికి వెళ్లింది. ఎవరూలేని సమయంలో విఠల్ ఇంట్లోనే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి ఇంటికి భార్య, కూతురు రాగా, తలుపులు ఎంతకీ తీయకపోవడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి వాటిని పగుల గొట్టారు. విఠల్ ఆత్మహత్య చేసుకోవడం చూసి భార్య, కూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు.