వరంగల్, జూలై 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ ఎంజీఎం మరోసారి సంచలనానికి కేంద్రమైంది. దవాఖాన ఔట్‌పోస్టు, తొర్రూర్ పోలీసుల నిర్లక్ష్యం ఓ నిరుపేద కుటుంబాన్ని ఆగం చేసింది. అన్నోన్ డెడ్‌బాడీని ఓ కుటుంబానికి అప్పగిస్తే, తీరా ఖననం చేసే సమయంలో సదరు మృతదేహం తమది కాదని గుర్తించడం తీవ్ర కలకలం రేపింది. మరణించాడని భావించిన వ్యక్తి అదే ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నాడని తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు.
అసలేం జరిగింది?
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి (50) 30ఏండ్ల క్రితం తన భార్య రమ, కూతురు స్వప్నను వదిలి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈనెల 9న తొర్రూరులో ఒక వ్యక్తి అపస్మారకస్థితిలో పడిపోయిన విషయాన్ని గుర్తించిన స్థానికులు 108 ద్వారా వర్ధన్నపేటకు తీసుకురాగా పరీక్షించిన వైద్యులు ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలిసిన కుమారస్వామి భార్య రమ ఈ నెల 10న ఎంజీఎంకు వచ్చి వార్డులో భర్తను చూసి సాయంత్రం వరకు అక్కడే ఉన్నది.
అదే రోజు సాయంత్రం రైలుకింద పడిన గుర్తుతెలియని మృతదేహం మార్చురీకి చేరింది. గోక కుమారస్వామి దవాఖానలో చేరినప్పుడు అన్నోన్ పేషంట్‌గా ఎంజీఎం పోలీస్ ఔట్‌పోస్టులో రికార్డు కావడం, అదేరోజు రైలు కింద పడిన అన్నోన్బాడీ అదే అవుట్‌పోస్ట్‌లో నమోదైంది. గోక రామస్వామి, అన్నోన్ డెడ్‌బాడీ పోలికలు ఒకేతీరుగా ఉండడంతో పోలీస్ ఔట్‌పోస్టు నుంచి తొర్రూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు రమకు ఫోన్ చేసి కుమారస్వామి చనిపోయిండు అని సమాచారం అందించారు. ఆమె 11న వరంగల్ ఎంజీఎం మార్చురికీ తన అల్లుడు, తమ్ముడితో వచ్చి ఊరికి తీసుకెళ్లింది. ఖననం చేసే సమయంలో ఆఖరి చూపుకోసం చూసిన తన కూతురు గర్తుపట్టడంతో తిరిగి దవాఖానకు తీసుకెళ్లినట్టు కుమారస్వామి భార్య రమ నమస్తే తెలంగాణకు వివరించారు.
ఎంజీఎంలో కలకలం
రాయపర్తి మండలంలో చోటుచేసుకున్న ఈ పరిణామం ఎంజీఎంలో కలకలం రేపింది. గోక కుమారస్వామి బతికే ఉన్నడా? చనిపోయిండా? ఏ వార్డులో ఉన్నడు? అంటూ ఎంజీఎం అంతా జల్లెడ పట్టగా.. చివరికి ఐడీ వార్డులో ఉన్నట్టు గుర్తించారు. ఆర్ఎం శశికుమార్ కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుని కుమారస్వామిని ఆర్థోవార్డుకు మార్చారు. ప్రస్తుతం వైద్యసేవలు అందుతున్నాయి.
పచ్చబొట్టుతో గుర్తింపు
మైలారంలో ఖననం చేసేముందు మృతదేహం కుడిచేయిని పరీక్షించారు. ఆ చేయిపై పచ్చబొట్టు లేకపోవటంతో ఆ శవం తమకు సంబంధించింది కాదని నిర్ధారించుకోవటం గమనార్హం. ఈనెల 9న ఎంజీఎంలో చేరినప్పటి నుంచి ఎవరినీ గుర్తుపట్టని కుమారస్వామి తన కూతురు రాగానే ‘స్వప్నా…స్వప్నా..’ అని పిలువడం విశేషం.