హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఒక తప్పు.. వంద తప్పులకు బీజం వేస్తుందట! రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 36, 37 భూముల్లో రెవెన్యూ శాఖ తీరు ఇలాగే తయారైంది. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు అధికార యంత్రాంగం వేసిన తప్పటడుగులు చివరకు హైకోర్టుకు సమర్పించే అఫిడవిట్లోనూ అబద్ధాలు వల్లించాల్సిన దుస్థితికి తీసుకొచ్చాయి. వాస్తవానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం ఇచ్చిన ఈ భూములను వివిధ కారణాలు.. రాష్ట్ర విభజన దరిమిలా చివరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఎకరా రూ.వంద కోట్ల వరకు ధర పలికే ఈ విలువైన భూములపై సర్కార్ పెద్దలు కొందరు కన్నేయడంతో అందుకు మార్గం సుగమం చేసేందుకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు జారీచేసిన ఎన్వోసీలు తీవ్ర దుమారం రేపాయి.
దాదాపు రూ.9 వేల కోట్ల విలువైన 90 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రచించిన ఈ కుట్రను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొనిరావడంతో అధికారులు కాస్త వెనక్కి తగ్గారు. అయినప్పటికీ, దాదాపు 45 ఎకరాల వరకు భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు రాత్రికి రాత్రి స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్, రోడ్లు వేసి అక్రమంగా లేఅవుట్ రూపొందించారు. దీనిపై ఉద్యోగుల సంఘం హైకోర్టును ఆశ్రయించడంతో బంతి న్యాయస్థానం కోర్టులోకి వెళ్లింది. అయితే, చాలాకాలంపాటు దీనిపై కౌంటర్ దాఖలు చేయకుండా తాత్సారం చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. కొన్నిరోజుల కిందట వేసిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు తీవ్ర విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత కలెక్టర్ నివేదికలకు విరుద్ధంగా అఫిడవిట్లో అంశాలను చేర్చడమే కాకుండా న్యాయస్థానం ఆదేశాలతో ఆగిన అక్రమ లేఅవుట్ గతంలోనే ఉన్నదని పేర్కొనడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.
గత నివేదికకు భిన్నంగా కలెక్టర్ అఫిడవిట్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 36, 37లో ఉన్న ప్రభుత్వ భూమిపై గత ఏడాది సర్కార్ పెద్దలు కన్నేయడం… ఉద్యోగులకు దక్కాల్సిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు విశ్వప్రయత్నం చేయడం తెలిసిందే. 90 ఎకరాలను కాజేసేందుకు మొదలైన ఈ భారీ కుట్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 90 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఎన్వోసీలు జారీ చేసినప్పటికీ, అనేక నాటకీయ పరిణామాల తర్వాత వాటిని కేవలం 17.04 ఎకరాలకు పరిమితం చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో 45 ఎకరాల వరకు భూమి అన్యాక్రాంతమైంది. భాగ్యనగర్ టీఎన్జీవోలు కోర్టును ఆశ్రయించగా… విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని (రంగారెడ్డి జిల్లా కలెక్టర్) కొన్ని నెలల కిందటనే ఆదేశించింది. కానీ, నెలల తరబడి స్పందించకుండా ఇటీవలనే రంగారెడ్డి కలెక్టర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
అఫిడవిట్‌లోని అంశాలపై ఎన్నో సందేహాలు
కలెక్టర్ హైకోర్టుకు ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్‌లోని వివరాలను క్లుప్తంగా పరిశీలిస్తే… గత ఏడాది జనవరిలో శ్రీవినాయకనగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌజింగ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వాళ్లు సర్వే నంబర్ 36లో తమకు చెందిన 17.04 ఎకరాల లేఅవుట్ చేసిన భూమికి ఎన్వోసీకి చేసిన దరఖాస్తుపై విచారణ చేపట్టాలని రాజేంద్రనగర్ ఆర్డీవో, శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను ఆదేశించగా… 2015లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల్లో భాగంగా తమ భూములను క్లెయిమ్ చేసుకుంటున్న డీ నర్సింగరావు, ఇతరులకు చెందిన ఆ భూమి బీటీ ఎన్జీవోలకు చెందిన భూమిలో భాగమేనని నివేదించారు. అంతేగాకుండా, హౌజింగ్ సొసైటీ గతంలో చేసిన 44 ఎకరాల లేఅవుట్ కూడా ఇందులో భాగమేనని, దాని సరిహద్దులు సైతం గుర్తించబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే నిజమైతే, 2021లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్డీవో, శేరిలింగంపల్లి తహసీల్దార్ ఇచ్చిన నివేదికలో అసలు సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు చెందిన 90 ఎకరాల భూమికీ, బీటీ ఎన్జీవోలకు చెందిన భూమికీ ఎలాంటి సంబంధంలేదని ఇచ్చిన నివేదిక సంగతేమిటి? ఒకే సర్వే నంబర్.. అదే భూమి… అదే వివాదం… గతంలోని అధికారులు ఇచ్చిన నివేదికకు విరుద్ధంగా ఇప్పటి అధికారులు నివేదిక ఇవ్వడమంటే ప్రభుత్వాలు మారితే అధికారుల నివేదికలు మారుతాయా?
ఇదే కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2022లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో 142.11 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నదని, దానిని పరిరక్షిస్తున్నామని స్పష్టంచేశారు. కానీ, తాజాగా ఇప్పటి కలెక్టర్ మాత్రం అందులో లేఅవుట్ ఉన్నదని పేర్కొన్నారంటే.. గత కలెక్టర్ చెప్పింది నిజమా?ఈ కలెక్టర్ చెప్పింది నిజమా?
డీ నర్సింగరావు, ఇతరుల భూమికి సంబంధించిన కేసులో సర్వే నంబర్లు 36, 37లో ఖాస్రా పహాణీలోనే కొందరు వ్యక్తుల పేర్లు వచ్చినందున, వారికి ఆ భూమిని చూపించాలనేది సుప్రీంకోర్టు ఆదేశం. ఈ క్రమంలో ఖాస్రా పహాణీలో ఉన్న వారి నుంచి శ్రీవినాయకనగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌజింగ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు భూమి ఎలా వచ్చింది? అందుకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు ఉన్నాయా? మరి అలాంటి లింకులు ఏవీ లేకుండానే సొసైటీ లేఅవుట్ భూమి అని కలెక్టర్ ఎలా నిర్ధారించారు? వారికి ఎలా అప్పగించారు?
హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో 17.04 ఎకరాల ఎన్వోసీలను మాత్రమే కలెక్టర్ పేర్కొన్నారు. కానీ, 90 ఎకరాలకు వచ్చిన ఎన్వోసీల సంగతేమిటి?
వాటిని అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదు?
కలెక్టర్ 17.04 ఎకరాలకు ఎన్వోసీ ఇచ్చామని పేర్కొనగా… క్షేత్రస్థాయిలో ప్రైవేటు వ్యక్తులు 45 ఎకరాల వరకు భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారు?
కలెక్టర్ గతంలో 44 ఎకరాల లేఅవుట్ సరిహద్దుల నిర్ధారణ (డీమార్కేషన్) జరిగిందని చెప్పారు. కానీ, గత ఏడాది జూలై-ఆగస్టులోనే ప్రైవేటు వ్యక్తులు రాత్రికి రాత్రి కంటెయినర్లు వేసి వంద ఫీట్ల రోడ్డుతో ఫెన్సింగ్ వేసి లేఅవుట్‌ను అభివృద్ధి చేసిన దృశ్యాలు అందరి కండ్ల ముందే ఉన్నాయి కదా. అయినా గతంలోనే లేఅవుట్ ఉన్నదంటూ కోర్టుకు ఎలా చెబుతారు?
హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో కలెక్టర్ పేర్కొన్న శ్రీవినాయకనగర్ హౌజింగ్ సొసైటీ లేఅవుట్ 1984లో జరిగింది. ఇది అదే భూమి అయితే 2010లో ఉద్యోగులు 142.15 ఎకరాల్లో 2,385 ప్లాట్లతో లేఅవుట్ అనుమతికి దరఖాస్తు చేస్తే జీహెచ్ఎంసీ ఎలా అనుమతి ఇస్తుంది? వట్టినాగులపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్ట్గేజ్ డీడ్ కూడా ఎలా పూర్తవుతుంది? అంటే రెండు లేఅవుట్ల భూమి ఒకటి కాదని స్పష్టమవుతున్నా… కలెక్టర్ మాత్రం ఉద్యోగులకు చెందిన భూమిని శ్రీవినాయకనగర్ హౌజింగ్ సొసైటీ భూమిగా చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ అఫిడవిట్లో పేర్కొన్న సొసైటీ లేఅవుట్ భూములకు సంబంధించిన సబ్ డివిజన్ సర్వే నంబర్లలోని భూమిని గతంలో పీవోటీ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు గత ఏడాది ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ శాఖకు ఇచ్చిన జాబితాలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడే అదే భూమిని చూపి గతంలో అక్కడ లేఅవుట్ ఉన్నదని హైకోర్టుకు చెప్తున్నారు.
కీలకమైన విషయమేమిటంటే, హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీవినాయకనగర్ హౌజింగ్ సొసైటీ లేఅవుట్ భూమి అయినందున నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. కానీ, కలెక్టర్ ఇందుకు సంబంధించి ఇచ్చిన ఎన్వోసీలో బీ/202/2025లో సుప్రీంకోర్టు విషయాన్నే పొందుపరచలేదు. కేవలం అక్కడ ప్లాట్లు ఉన్నందున నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టు చెప్పడం గమనార్హం.
భూమి దక్కేదాకా మా పోరాటం ఆగదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తమ సొసైటీ సభ్యుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అన్యాయం. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు గత అధికారుల నివేదికలకు విరుద్ధంగా ఇప్పుడు నివేదికలు ఇచ్చి ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు పలుకడం విస్మయాన్ని కలిగిస్తున్నది. మేం 2010లోనే జీహెచ్ఎంసీ అనుమతితో లేఅవుట్ చేసినా 1984లో జరిగిన లేఅవుట్‌ను ఈ భూమిలో జరిగినట్టుగా చిత్రీకరించడం సమంజసం కాదు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు న్యాయంగా ఇండ్ల స్థలాలు దక్కేదాకా ఈ పోరాటం ఆగదు. మా ఆందోళన శనివారంతో 200 రోజులకు చేరుకుంటున్నందున శనివారం జరిగే నిరసన కార్యక్రమానికి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ హాజరు కానున్నారు. మా భూములు మాకు దక్కే వరకు ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించేది లేదు.
– ముత్యాల సత్యనారాయణగౌడ్,భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోస్ (గచ్చిబౌలి) హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు.