గుడిహత్నూర్, అక్టోబర్ 23 : అప్పుల బాధలు భరించలేక ఓ కౌలు రైతు తనువు చాలించాడు. సరైన దిగుబడి రాక.. పంట పెట్టుబడులు మీద పడి.. చేసిన అప్పులు తీర్చే దారిలేక వ్యవసాయ పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మంగళవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం నేరడిగొండ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ఆడె గజానంద్ (30) మూడేండ్ల నుంచి నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఏటా అనుకున్న స్థాయిలో దిగుబడి రాకపోవడంతో పంట పెట్టుబడుల కోసం రూ.6 లక్షలు అప్పు చేశాడు. గుడిహత్నూర్ మహారాష్ట్ర బ్యాంకులో రూ.3 లక్షలు, ఇచ్చోడ ఎస్బీఐలో రూ.1.50 లక్షలు, ప్రైవేట్‌గా మరో ఇద్దరి దగ్గర రూ.2 లక్షల చొప్పున అప్పు చేశాడు. ఈ ఏడాది కూడా దిగుబడి సరిగా లేక.. అప్పు ఎలా తీర్చాలనే బెంగతో మనస్తాపానికి గురయ్యాడు. చేసేదిలేక మంగళవారం సాయంత్రం చేను వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. గజానంద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు.
నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావాలో వివరణ ఇచ్చేందుకు రావాల్సిన మంత్రి కొండా సురేఖ బుధవారం కోర్టుకు గైర్హాజరయ్యారు. తన తరఫున న్యాయవాదిని నియమించుకున్నట్టు కోర్టుకు మెమో ఆఫ్ అప్పియరెన్స్‌ను దాఖలు చేశారు. దీంతో ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. మంత్రి చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై కొండా సురేఖ కోర్టుకు వివరణ ఇవ్వాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. లంగర్‌హౌజ్ పోలీసులు సురేఖకు సమన్లు జారీచేశారు. న్యాయవాది సమక్షంలో హాజరయ్యేలా ఆమె వెసలుబాటు కల్పించుకున్నారు.