హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 7 ( నమస్తే తెలంగాణ ): వారిది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. క్యాబ్ నడిస్తేనే జీవనం. కానీ, పార్కిన్సన్స్ వ్యాధితో ఆ ఇంటి యజమాని దవాఖాన పాలుకాగా, వారి బతుకు ‘బండి’ ఆగిపోయింది. అతడి వైద్యానికి అందినకాడల్లా అప్పులు చేసిన భార్య.. వాటిని తీర్చే స్థోమతలేక, కుటుంబాన్ని పోషించలేక సతమతమవుతున్నది. మరో సర్జరీ చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక అరిగోసపడుతున్నది. ఆపత్కాలంలో ఆదుకొనే ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నది. వివరాల్లోకెళితే, యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన గంజి శివకుమార్ (45) నగరంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకొనేవాడు. ఇద్దరు కొడుకులు, భార్యతో ఆనందంగా జీవించేవాడు. అయితే, పదేండ్ల క్రితం పార్కిన్సన్స్ వ్యాధి అతడిని మంచానికే పరిమితం చేసింది. దీంతో ఆ ఇంటిభారం శివకుమార్ భార్య జయలక్ష్మిపై పడింది.
ఓ వైపు తన భర్తకు వైద్యం.. మరో వైపు కుటుంబ పోషణ.. ఇంకోవైపు పిల్లల చదువు.. ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మొక్కవోని దీక్షతో నమ్ముకొన్న టైలిరింగ్ వృత్తితోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. ఇటీవల తన భర్త ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్సకోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అతడికి సర్జరీ చేయాలని, అందుకు సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. గతంలోనూ సర్జరీ చేయగా, రూ.5 లక్షల వరకు ఖర్చు చేసింది. దాతలు ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించాలని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని జయలక్ష్మి కోరుతున్నది. ఎవరైనా ఆర్థికసాయం చేయదలుచుకొంటే 9393726444 (ఫోన్ పే), 8886142298 (గూగుల్ పే) నంబర్లో సంప్రదించాలని వేడుకొంటున్నది.
మా కుటుంబాన్ని ఆదుకోండి
నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి డిగ్రీ, రెండో కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. నా భర్త క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ మమ్మల్ని పోషించేవాడు. పదేండ్ల నుంచి పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన వైద్యం కోసం అందినకాడల్లా అప్పు చేశా. కుటుంబ భారమంతా నాపైనే పడింది. టైలరింగ్‌తో నెట్టుకొస్తున్నా. ఇప్పుడు సర్జరీకి మళ్లీ 8లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారు. మాది పేద కుటుంబం. మాకు సాయం చేసి ఆదుకోండి.
–జయలక్ష్మి, గంజి శివకుమార్ భార్య