వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 8: నీట్ 2023లో అర్హత సాధించి రెండో విడత కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మేనేజ్మెంట్ సీటు దక్కని అభ్యర్థులకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మూడో విడత నోటిఫికేషన్ ద్వారా మరో అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.
ఇప్పటికే రెండు విడతల్లో సీట్ల కేటాయింపు జరిపి సీటు సాధించిన అభ్యర్థుల వినతి మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో అభ్యర్థుల రిపోర్టింగ్ గడువును శుక్రవారం వరకు పెంచడంతోపాటు అప్‌గ్రేడింగ్‌కు అవకాశం కల్పించారు. దాంతోపాటు సోమవారం పూర్తి వివరాలతో యాజమాన్య కోటాలో మిగిలి ఉన్న సీట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. స్థానిక అభ్యర్థుల ప్రయోజనాల కోసం మంత్రి చొరవ తీసుకోవడంతోపాటు మూడో విడత నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉండటంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.