ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై అకృత్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురిని కిరాతకంగా హతమార్చిన అల్లరి మూకలు, తాజాగా మరో మైనారిటీ యువకుడిని దారుణంగా చంపాయి. సునాంగంజ్ జిల్లాలోని భంగదోహోర్ గ్రామంలో ఓ యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేసి, విషమిచ్చి హత్య చేశాయి. పక్కా ప్రణాళికతో దుర్మార్గులు హత్యకు పాల్పడ్డట్టు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే జోయ్ మొహపాత్రో భంగదోహోర్ వాసి. గురువారం అతడిని అమిరుల్ ఇస్లాం అనే వ్యక్తి స్థానికంగా దుకాణానికి పిలిచి దాడికి పాల్పడ్డాడు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై జరుగుతున్న వరుస దాడులను భారత్ ఖండించింది.
పాక్‌లో మైనారిటీ రైతు హత్య.. సింధ్‌లో నిరసనలు
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సులో ఇటీవల ఓ మైనారిటీ రైతును భూ యజమాని కాల్చి చంపారు. దీంతో దేశంలోని మైనారిటీలు భారీస్థాయిలో నిరసన తెలిపారు. కైలాష్ కోల్హి అనే హిందూ కౌలు రైతుపై సర్ఫరాజ్ అనే భూస్వామి తుపాకీతో కాల్పులు జరపగా ఛాతిలో నుంచి తూటా దూసుకెళ్లడంతో కైలాష్ అక్కడికక్కడే మరణించినట్లు వార్తలు తెలిపాయి. రైతు హత్యకు కారణమేమిటో తెలియరాలేదు.