Manair Vagu | కాల్వశ్రీరాంపూర్, మార్చి 2 : మానేరు వాగుపై అక్రమంగా కొనసాగుతున్న మరో టోల్‌ట్యాక్స్ వసూలు దందా వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు వద్ద టోల్‌ట్యాక్స్ పేరుతో వసూళ్ల దందాను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడంతో అధికారులు దానిని తొలగించగా.. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులో మరోటి బయటపడింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట-జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపెల్లి గ్రామాల మధ్యన ఇలాంటి ‘దారి’ దోపిడీ వెలుగులోకి వచ్చింది. కిష్టంపేట-బూర్నపెల్లి గ్రామాల మధ్యన మానేరు వాగుపై సుమారు కిలోమీటరు మేర మట్టి రోడ్డు వేసి అనధికారికంగా డబ్బులు గుంజుతున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో అనధికారికంగా టెండర్లు పిలవగా గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.15.10 లక్షలకు టెండర్ దక్కించుకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ రహదారి మీదుగా రోజుకు సుమారు 100 వాహనాలు వెళ్తుంటాయి. ద్విచక్రవాహనానికి రూ.30, లారీకి రూ.200, ఆటో, ట్రాక్టర్లకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని తదితర పట్టణాలకు వెళ్లాంటే ఇక్కడి నుంచే దగ్గరగా ఉంటుందని వాహనదారులు చెప్తున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వ్యక్తులు టోల్ ట్యాక్స్ పేరిట డబ్బులు గుంజుతున్నారని వాహనదారులు మండిపడుతున్నారు.
ఫొటోలు తీస్తే మాకేం కాదు
మీరెన్ని ఫొటోలు తీసినా మాకేం కాదు. ఒక్క రోజు మాత్రమే బంద్ ఉంటది కావచ్చు. రెండో రోజు యథావిధిగా వాహనాలు నడుస్తాయి. లేదంటే వాగులో పోసిన మట్టిరోడ్డుపై గుంతలు తవ్వి వాహనాలు నడవనివ్వం.
– డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి