జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన లగచర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించడంలేదు. రైతుల్లో ఆగ్రహం చల్లారకముందే మరోసారి భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మా పేరిట బలవంతంగా భూములు గుంజుకునేందుకు సిద్ధమై, తీవ్ర ప్రజావ్యతిరేకతను చవిచూసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మరోమార్గంలో తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఫార్మా క్లస్టర్ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టే కనిపించిన సర్కారు.. ఇప్పుడు ‘పారిశ్రామిక కారిడార్’ పేరిట ఉద్రిక్తతలు తగ్గని ఆ పల్లెల్లో మళ్లీ భూసేకరణకు సిద్ధమైంది. రైతులు తమ పొలాలు ఇవ్వబోమని చెప్తున్నా.. పోలీసు బలగాలను గ్రామాల్లో మోహరించి భయానక వాతావరణం సృష్టిస్తున్నది. తద్వారా రైతులను లొంగదీసుకునేందుకు అన్ని ఒత్తిళ్లనూ ప్రయోగిస్తున్నది.
Lagacharla | కొడంగల్, జనవరి 29: లగచర్ల ఉదంతంతో వెనక్కి తగ్గినట్టు కనిపించిన రేవంత్ సర్కారు.. ఈసారి మరోముసుగులో రైతుల నుంచి భూసేకరణకు ప్రయత్నిస్తున్నది. భూములివ్వని పాపానికి సుమారు రెండున్నర నెలలుగా లగచర్ల రైతులు జైళ్లచుట్టూ తిరుగుతున్నారు. మానసిక క్షోభ నుంచి వారి కుటుంబాలు నేటికీ కోలుకోలేదు. ఉద్రిక్తతల నుంచి ఆ గ్రామాలు ఇంకా తేరుకోకముందే సర్కారు మరోసారి క వ్వింపు చర్యలకు దిగుతున్నది. వారి నుంచి భూసేకరణకు ఒత్తిడి పెంచుతున్నది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండ లం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.. అందుకు అవసరమైన భూసేకరణ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ముందుగా అసైన్డ్ భూములను సేకరించనున్నట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. భూములివ్వని రైతులపైనే ప్రధానంగా దృష్టిసారించినట్టు చెప్తున్నారు. ఈ నెల 31 నుంచి అసైన్డ్ భూముల సర్వే పనులు చేపడ్తామని దుద్యాల తహసీల్దార్ కిషన్ చెప్తున్నారు.
ఈ మేరకు బుధవారం లగచర్ల, రోటిబండతండాలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. లగచర్లకు చెందిన 102 సర్వే నంబర్లో 43 మంది రైతులకు సంబంధించి 47.25 ఎకరాలు, రోటిబండత తండాలో అదే 102 సర్వే నంబర్లో 30 మంది రైతులకు చెందిన 22 ఎకరాలు, పులిచెర్లకుంట తండాలో 117. 120,121 సర్వే నంబర్లలోని 20 మంది రైతులకు చెందిన 40.15 గుంటలకు సంబంధించి భూసర్వే కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాలో మొత్తంగా 110 ఎకరాల అసైన్డ్ భూములకు సర్వే చేపట్టి ఆయా రైతులకు సంబంధించి హద్దులను గుర్తించనున్నట్టు తెలిపారు. తహసీల్దార్‌తోపాటు డీటీ వీరేశ్‌బాబు, ఆర్ఐ నవీన్ పాల్గొన్న ఈ సమావేశాల్లో రైతుల కన్నా పోలీసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. నిన్నటిదాక ఫార్మా!.. ఇప్పుడు పారిశ్రామిక క్లస్టర్!.. ప్రభుత్వం తమను ఎందుకిలా వేధిస్తున్నదని దుద్యాల మండల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ భూముల జోలికి రావొద్దని వేడుకుంటున్నారు. తాము పోరాడి అలసిపోయామని, అయినా ప్రభుత్వం పదే పదే తమను వేధిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.