బషీరాబాద్, ఫిబ్రవరి 16: కాంగ్రెస్ సర్కార్ మొండివైఖరితో మాజీ సర్పంచులు సతమతం అవుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక, అప్పులభారం అధికమై ప్రాణాలమీదికి తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో ఆదివారం దళిత మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటుచేసుకున్నది. బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామానికి చెందిన వెంకటప్ప 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా గెలుపొందారు. గ్రామాభివృద్ధిలో భాగంగా రూ.6 లక్షల పంచాయతీ నిధులతో గ్రామంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు, పైపులైన్ లీకేజీ పనులు చేయించారు.
ఆయా పనులు చేసి దాదాపు మూడేండ్లు గడిచినా నిధులు రాకపోవడంతో అప్పులభారం పెరిగింది. దీంతో మనస్తాపానికి గురైన వెంకటప్ప ఆదివారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద పురుగుల తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా పంచాయతీ కార్మికులకు తెలపడంతో వారు ఆయన కుటుంబీకులకు చెప్పారు. దీంతో అతడిని హుటాహుటిన తాండూరు జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పడంతో వికారాబాద్ మిషన్ దవాఖానకు తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరే కాశీంపూర్ మాజీ సర్పంచ్ వెంకటప్ప ఆత్మహత్యయత్నానికి కారణామని రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ నేత రాజిరెడ్డి విమర్శించారు. మాజీ సర్పంచులకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించక రాష్ట్రంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్ల పెండింగ్ బకాయిలను మాజీ సర్పంచులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంకటప్పకు ఏదైనా జరిగితే, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.