హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రా ప్రాంతానికి చెంది న మరో మాజీ ఐఏఎస్ అధికారికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. దేవాదాయశాఖ డైరెక్టర్‌గా, యాదాద్రి ఆలయ ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతూ నేడు(ఆగస్టు 31)ఉద్యోగ విరమణ చేయాల్సిన ఎస్ వెంకటరావును.. యాదగిరిగుట్ట ఈవోగా, శిల్పారామం కల్చరల్ సొసైటీ ప్రత్యేకాధికారిగా పునర్నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వెంకటరావు గతంలో మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా, రెవెన్యూశాఖలో పనిచేయగా.. కొంతకాలంగా దేవాదాయశాఖ డైరెక్టర్‌గా, యా దాద్రి ఆలయ పాలనాధికారిగా కొనసాగుతున్నారు.
శిల్పారామం సొసైటీ ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్న మాజీ ఐఏఎస్ అధికారి జీ కిషన్‌రావును తొలగించి ఆయన స్థానంలో వెంకటరావును నియమించడం గమనార్హం. ఇప్పటికే ఆంధ్రా ప్రాంత మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా, సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమించా రు. తాజాగా వెంకటరావును పునర్నియమించడం చర్చనీయాంశమైంది. ఐఏఎస్‌ల విభజనలో భాగంగా శ్రీనివాసరాజును ఆంధ్రాకు కేటాయించగా, అక్కడ వీఆర్ఎస్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వంలో చేరారు. ఆయనను మొదట ప్రభుత్వం మౌలిక సదుపాయాల విభాగం ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అనంతరం సీఎం ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.