ఆదిలాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకు అధికారుల వేధింపులు భరించ లేక శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవ్‌రావు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోగా.. ఆదివారం అదే జిల్లాలో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాగులో ఆశించిన మేర దిగుబడులు రాకపోవడం.. పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగకపోవడం.. పెట్టుబడి సాయం అందకపోవడం.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక రైతులు తనువు చాలిస్తున్నారు. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజీతండాకు చెందిన కౌలు రైతు రాథోడ్ గోకుల్ (40) పదేండ్లుగా పదెకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. పంటలు సరిగా పండకపోవడంతో నష్టపోయాడు. దీంతోపాటు ఇటీవల ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు ఉన్నట్టు సమాచారం. అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోకుల్ ఈనెల 12న కౌలు చేస్తున్న వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగాడు. ఇంటికి వచ్చి వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు వెంటనే ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు.
సర్కార్ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు: మాజీ మంత్రి జోగు రామన్న
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన రిమ్స్‌కు వెళ్లి రైతు రాథోడ్ గోకుల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోకుల్ పది ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా, కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించడంలో విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కౌలు రైతు గోకుల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.