HCU | హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో జింక మృత్యువాత పడింది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. 100 ఎకరాల్లో చెట్లని కొట్టివేయడం వల్ల ఆవాసం లేక బయటకు వచ్చిన జింకను కుక్కలు కరిచి చంపాయి. ఒకవైపు వరుసగా జింకలు చనిపోతుంటే మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ కాంగ్రెస్ సర్కార్ బుకాయిస్తున్న సంగతి తెలిసిందే. మూగజీవుల ప్రాణాలు తీస్తున్న రాక్షస ప్రభుత్వమని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 5వ తేదీన జింకపై కుక్కలు దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. ఒళ్లు గగుర్పొడిచేల ఆ జింకపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా కరిచాయి. దేహాన్ని రెండుగా చీల్చాయి. ఈ దాడిలో కూన అక్కడికక్కడే మరణించింది. ఈ విషాదం ఏప్రిల్ 5న హెచ్సీయూలో బయటపడింది. రెండుగా చీలి ఉన్న జింక దేహాన్ని చూసి హెచ్సీయూ విద్యార్థులు, పర్యావరణ, జంతు ప్రేమికుల హృదయం తల్లడిల్లింది. ఇంకా ఎన్ని మూగజీవాల ప్రాణాలు పోవాలని పర్యావరణ, జంతు ప్రేమికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.