Navneet Kaur | మహారాష్ట్ర అమరావతి ఎంపీ, సినీ నటి, బీజేపీ స్టార్ క్యాంపెయిన్ నవనీత్ కౌర్ రాణాపై తాజాగా మరో కేసు నమోదైంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ఎంపీ ఒవైసీ సోదరులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్చార్జి రాకేశ్ ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ నెల 8న లక్ష్మి గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో ఆమె రొచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను నవనీత్ గుర్తు చేశారు. ‘వారికి 15 నిమిషాలేమో.. పోలీసులు తప్పుకుంటే అదే తమకు 15 సెకన్లు చాలు. తాము తలుచుకుంటే ఎక్కడికిపోతారో తెలియదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇప్పటికే షాదానగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాక్‌కు వేసినట్లే వ్యాఖ్యనించడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. మరో వైపు కేసులు నమోదైనా నవనీత్ రాణా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒవైసీ సోదరులపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతివీధిలో రామభక్తులు ఉన్నారని.. మోదీ సింహాలు ఉన్నాయంటూ హెచ్చరించారు. తాను హైదరాబాద్‌కు వస్తున్నానని.. తనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.