అచ్చంపేట, మార్చి 25 : ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. సొరంగం 13.5 కిలోమీటర్ వద్ద కన్వేయర్ బెల్టు నుంచి 40 మీటర్ల దూరంలో శిథిలాల కింద సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా, దుర్గంధం రావడంతోపాటు మృతుడికి సంబంధించిన కాళ్లు కనిపించాయి. మంగళవారం మధ్యాహ్నం సమయంలో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. టీబీఎం మెషిన్ కిందిభాగంలో శిథిలాల కింద ఇరుక్కొని ఉండటంతో పరికరాలను గ్యాస్‌కట్టర్ ద్వారా తొలగించి బయటకు తీశారు. మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను నమోదు చేశారు. యూపీకి చెందిన ఇంజినీర్ మనోజ్‌కుమార్‌గా అధికారులు నిర్ధారించారు. మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఉత్తరప్రదేశ్‌కు పంపించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. గురుప్రీత్‌సింగ్ శవం లభించిన ప్రదేశానికి.. రెండో మృతదేహం లభించిన ప్రదేశానికి దాదాపు 200 మీటర్ల దూరం ఉంటుందని సింగరేణి జనరల్ మేనేజర్ బైద్య తెలిపారు.
మిగిలిన ఆరుగురి కోసం అన్వేషణ..
టన్నెల్లో ఇద్దరి శవాలు దొరకగా, మిగిలిన వారి మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతున్నది. క్యాడవర్ డాగ్స్, మినీ జేసీబీలు, ఇతర యంత్రాలు, రెస్క్యూ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వాహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.