వాంకిడి, నవంబర్ 4: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గతనెల 30న వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థినులు చికిత్స పొందుతుండగా గత రెండు, మూడు రోజుల్లో మరో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంకిడి ప్రభుత్వ దవాఖానాలో సోమవారం 18 మంది, ఆశ్రమోన్నత పాఠశాలలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. మరికొంతమందిని ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల, హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో శైలజ, మహాలక్ష్మి, జ్యోతిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. దీంతో మిగతా విద్యార్థినులు భయాందోళనకు గురై ఇంటిబాట పడుతున్నారు. ఆశ్రమంలో 590 మంది విద్యార్థినులు ఉండగా ప్రస్తుతం 95 మంది మాత్రమే ఉన్నారు. బయట ఫుడ్ తెచ్చుకొని తినడం వల్ల ఇలా జరిగిందని హెచ్ఎం, వార్డెన్ చెబుతుండగా నాణ్యత లేని రంగు మారిన భోజనం తిన్న తర్వాతే అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. ఐదు రోజులైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు నివేదిక ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఐటీడీఏ పీవో ఖుష్బూ పాఠశాలను తనిఖీ చేసి హెచ్ఎం, వార్డెన్‌కు సూచనలు చేశారు.