South Central Railway | దక్షిణ మధ్య రైల్వేకు గుర్తు అగంతకుడు బెదిరింపు లేఖ రాశాడు. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని లేఖలో రైల్వే అధికారులను హెచ్చరించాడు. వారంలో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ – ఢిల్లీ మార్గంలో ఘటన జరుగుతుందని హెచ్చరించాడు. అయితే, ఆగంతకుడి నుంచి గతవారం హెచ్చరిక లేఖ రైల్వే అధికారులకు అందింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై నార్త్ జోడ్ డీసీపీ చందనాదీప్తి మాట్లాడుతూ.. రైల్వే అధికారులకు హెచ్చరిక లేఖ వచ్చిందని ధ్రువీకరించారు.
మూడు రోజుల కిందట రైల్వే అధికారులు తమకు సమాచారం అందించారని చెప్పారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు. ఇదిలా ఉండగా.. జూన్ 2న ఒడిశా బాలాసోర్ జిల్లా బహనగ రైల్వేస్టేషన్లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో దాదాపు 280 మందికిపైగా మృతి చెందగా.. వెయ్యి మందికిపైగా గాయాలకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రమంలో రైల్వే అధికారులకు బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టిస్తున్నది. అయితే, బెదిరింపులు ఆకతాయిలా పనేనా…? మరేదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.