హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): ఎరుకల కులస్థుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పిగ్ బ్రీడింగ్ పాలసీని తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి జీవో నంబర్ ఎంఎస్ 3ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ ఎస్టీ సంఘాల ప్రతినిధులు మంగళవారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, మంత్రి పువ్వాడ అజయ్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం రమేశ్ మాట్లాడుతూ.. ఎరుకల కులస్థులు తమ కులవృత్తి పందుల పెంపకాన్ని కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టడం మరువలేదని చెప్పారు. ఎస్టీల సమస్యలను పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టంచేశారు.