సిద్దిపేట, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హల్దీవాగులో తొవ్వ పెట్టిన తోడేళ్లే నీతులు వల్లిస్తున్నాయి. వాగు నీళ్లను మళ్లించి ఇసుక కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ ముఠానే మీడియా ముందుకొచ్చి అక్రమ వ్యాపారాన్ని సహించేది లేదంటూ పలుకుతున్నది. జిల్లాలో ఇక మీదట ఇసుక అక్రమదందా చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలూ జారీ చేస్తున్నది. ఈమేరకు ఎస్పీ, డీఎస్పీ, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్టు మెదక్ జిల్లా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ విస్మయం కలిగిస్తున్నది.
‘నడివాగులో తోడేళ్ల తొవ్వ’ అనే శీర్షికతో ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వాగుపై మూడుచోట్ల అక్రమ క్వారీలు ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా సుమారు 45 రోజులుగా మెదక్ నడిబొడ్డుగా లారీలు తిరుగుతున్నా ముఠానాయకులకు కనిపించలేదుగానీ, నమస్తేలో కథనం రాగానే హడావుడిగా ప్రకటన విడుదల చేయడంపై స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పొద్దంతా నాలుగు ప్రొక్లెయినర్లు వాగు మధ్యలో ఇసుక తోడి మేట వేస్తున్నాయి. రాత్రి 10 టైర్ల కంటైనర్లలో నింపి అటు కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు, ఇటు హైదరాబాద్ నగరానికి తరలిస్తుంటారు. స్థానికంగా ఒక్క లారీకి రూ 25 వేల చొప్పున లెక్కలు రాసుకునే వ్యక్తి స్వయానా కాంగ్రెస్ ముఠా నాయకుడి అనుచరుడే కావడం గమనార్హం. వాగు నుంచి జిల్లా సరిహద్దు వరకు ఆయనే బాధ్యుడు. ఇందుకోసం సదరు వ్యక్తి ప్రత్యేక ఇన్నోవా వాహనంలో తిరుగుతూ కనిపించారు. నమస్తే తెలంగాణ ప్రతినిధులు ఆ వాహనాన్ని హల్దీవాగు వద్దనే పసిగట్టి ఫొటోలూ తీసింది.
ఆ వాహనం చూస్తే అందులో తిరిగే వ్యక్తి ఎవరో? ఎవరికి ప్రధాన అనుచరుడో.. మెదక్ పట్టణ ప్రజలెవరిని అడిగినా ఇట్టే చెబుతారు. రైతుల పొలాలను ఎండబెట్టి ఇంతకాలం అక్రమదందా చేసిన వ్యక్తులే, ఇప్పుడు బటయకు వచ్చి అలాంటివి చేయొద్దని ప్రకటనలు చేయడంపై పరిసర గ్రామాల రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దొంగలే దొంగా.. దొంగా.. అన్నట్టుగా వ్యవహరిస్తే తామెవరికి చెప్పుకోవాలని మక్తభూపతిపూర్, సంగాయగూడ రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.