వరంగల్, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణకు తాగు, సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తికి విరుద్ధంగా అన్నారం బరాజ్ దిగువన ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడింది. ‘బరాజ్‌ను బలిపెట్టి.. ఇసుక కొల్లగొట్టి’ శీర్షికతో బుధవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో వచ్చిన కథనంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్నారం బరాజ్ దిగువన ఇసుక తవ్వకాలను నిలిపివేశారు.
మూడు పెద్ద పొక్లెయినర్లతో వందల లారీల్లో ఇక్కడ ఇసుక లోడింగ్ ఆగిపోయింది. బరాజ్ దిగువన బుధవారం ఒక్క పొక్లెయిన్, ఒక్క లారీ కనిపించలేదు. అధికారులు వచ్చి అన్నింటినీ గోదావరి నది ఒడ్డునకు తరలించారు. ప్రభుత్వ అనుమతితో అన్నారం క్వారీలో ఇసుక తవ్వుతున్న కాంట్రాక్టర్లు, కింది స్థాయి ఉద్యోగులు కలిసి బరాజ్ దగ్గరగా తవ్వకాలు జరిపారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్టు తెలిసింది.