కొడంగల్, ఏప్రిల్ 17 : వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామంలో ప్రతిపాదిత ప్రభుత్వ మెడికల్, వెటర్నరీ కళాశాల ఏర్పాటు పనులను రైతులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 19లో రైతుల వద్ద నుంచి సేకరించిన భూమిని గురువారం అధికారులు చదును చేయగా.. అన్నదాతలు అడ్డగించారు. పూర్తి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రైతులతోపాటు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… అప్పాయిపల్లిలోని సర్వే నంబర్ 19లో మెడికల్, వెటర్నరీ కళాశాలల నిర్మాణాల కోసం 47 మంది రైతుల నుంచి 60 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం సేకరించిందని పేర్కొన్నారు.
ఎకరాకు రూ.10 లక్షలతో పాటు ఇంటి స్థలం, ఉద్యోగం తదితర హామీలు ఇచ్చి, అరకొరగా చెల్లించారని ఆరోపించారు. సర్వే నంబర్ 19లో మొత్తం 47 మంది రైతులు ఉండగా, 53 మందికి పరిహారం చెల్లించినట్టు అధికారులు ప్రకటించడంపై అనుమానం వ్యక్తం చేశారు. అసలైన రైతులకు పరిహారం చెల్లించకుండా ఈ భూములతో సంబంధం లేని ఆరుగురికి దాదాపు రూ.70-80 లక్షల వరకు పరిహారం ఇచ్చారని ఆరోపించారు. ఇక్కడ భూములు లేని, రికార్డుల్లో పేర్లు లేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పరిహారం ఇచ్చారని ఆరోపించారు. పరిహారం కోసం పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. దౌర్జన్యంగా పనులు చేపడితే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. రైతులకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతుగా నిలవాలని, బలవంతపు భూసేకరణను అడ్డుకోవాలని కోరారు.