హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంపై అధికార పార్టీకి చెందిన గొల్లకురుమ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేశారా? తమకు పదవులు దక్కకపోవడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన గొల్లకురుమ వర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వంలో గొల్ల కురుమలకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన గొల్ల కురుమలకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.
రాజకీయంగా బీసీలకు రావాల్సిన వాటా రావడం లేదని, ఈ సమయంలో బీసీలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో గొల్ల కురుమలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. తమ కులం వారికి టీపీసీసీ అధ్యక్ష పదవితోపాటు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు 6 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 5 కమిషన్ మెంబర్లు ఇవ్వాలని కోరారు. ఇంకా రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో తోటకూర జంగయ్య యాదవ్, చరణ్‌కౌశిక్ యాదవ్, గౌరీసతీశ్, లోకేశ్ యాదవ్, రాజేశ్, గడ్డం శేఖర్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, సౌధని భూమన్న యాదవ్, కల్పన, మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.