వేములవాడ, జనవరి 11: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో అక్రమ ఓటర్ల నమోదుపై ఓ సామాజిక కార్యకర్త ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆదివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓట్ల అభ్యంతరాలపై ఫిర్యాదు పత్రాలు, అధికారులు ఇచ్చిన వివరణ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కుప్పాల మోహన్ మాట్లాడుతూ వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని వార్డుల్లో ఇతర గ్రామాల నుంచి అక్రమంగా ఓటర్లను నమోదు చేయించారని అభ్యంతరాలు వ్యక్తం చేశామని తెలిపారు.
ఓటర్ ముసాయిదా జాబితాను ప్రకటించిన తర్వాత ఈ నెల 8న 11వ వార్డులో దాదాపు 400పైగా ఇతర గ్రామాల నుంచి అక్రమంగా ఓటర్లను నమోదు చేయించారని అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఎన్నికల నిబంధనల మేరకు ఇప్పుడు ఏమీ చేయలేమని సమాధానమిస్తున్నారని మండిపడ్డారు. ముసాయిదా జాబితాలో అభ్యంతరాలు తెలపాలని ఇచ్చిన తర్వాత మళ్లీ అభ్యంతరాలు తెలిపితే ఏమీ చేయలేమంటే ఎందుకు అభ్యంతరాలు కోరుతున్నారని ప్రశ్నించారు. సామాజిక కార్యకర్తల మోహన్.. అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులతోపాటు వారు ఇచ్చిన సమాధాన పత్రాలను కాల్చివేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.