Congress | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి 3 నెలలు తిరక్కుండానే ఆ పార్టీలో అసమ్మతి రాగాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్న నాయకులను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి లోక్‌సభ ఎన్నికల టికెట్లు కేటాయించడాన్ని తప్పుబడుతూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎల్ నిరంజన్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం ఇప్పటికే కలకలం సృష్టించింది. నిరంజన్ అభిప్రాయంతో తాజాగా కాంగ్రెస్ కురువృద్ధుడు వీ హనుమంతరావు గొంతు కలపడంతో ఆ పార్టీలో నివురుగప్పిన నిప్పులా రాజకుంటున్న అసమ్మతి ఒక్కసారిగా బట్టబయలైంది. మరోవైపు నామినేటెడ్ పోస్టుల చిచ్చు కాంగ్రెస్‌ను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో రాష్ట్రంలో కనీసం 12 లోక్‌సభ సీట్లను గెలుచుకోవాలన్న లక్ష్య సాధనకు పార్టీ శ్రేణులు మనస్ఫూర్తిగా సహకరించవేమోనని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్‌కు అధికారం దక్కడంతో ఇంతకాలం ఆ పార్టీని నమ్ముకున్న నాయకులంతా తమకు మంచి రోజులు వస్తాయని గంపెడాశతో ఎదురు చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టికెట్లు లభించకపోయినప్పటికీ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశమైనా దక్కుతుందని భావించారు. ఇప్పుడు ఆ ఆశలు కూడా ఆవిరైపోవడంతో సీనియర్లకు మింగుడు పడటం లేదు. మొన్నటి దాకా అధికారాన్ని అనుభవించిన నాయకులను అప్పటికప్పుడు కాంగ్రెస్‌లో చేర్చుకుని లోక్‌సభ టికెట్లు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొందరు నేతలు బాహాటంగానే అసమ్మతి గళాన్ని విప్పుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ వైఖరిని తూర్పారబడుతున్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరి ఎంపీ టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు కూడా ఆందోళన చెందుతు న్నారు. తమ విజయానికి పార్టీ క్యాడర్ సహకరిస్తుందా? లేదా? అని అనుమానిస్తున్నారు.
‘క్లియరెన్స్ సేల్’ చిట్కాతో..
కొత్త సరుకును అమ్ముకునేందుకు పాత సరుకును ‘క్లియరెన్స్ సేల్’ పేరుతో కారుచౌకగా అమ్మడం వ్యాపారులు అనుసరించే చిట్కా. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నది. ఖమ్మం ఎంపీ టికెట్‌ను తనకు అనువైన వ్యక్తికి ఇప్పించుకునేందుకు రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపిన రేవంత్‌రెడ్డి.. వరంగల్ టికెట్‌ను ఆశించిన సిరిసిల్ల రాజయ్యకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవిని, భువనగిరి టికెట్‌ను ఆశించిన పటేల్ రమేశ్‌రెడ్డికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టిన విషయం విధితమే. నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్‌ను డాక్టర్ మల్లు రవికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇంతకాలం ఆయా పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో అసమ్మతి రాజుకుంటున్నది.
అగ్గి రాజేస్తున్న నామినేటెడ్ పోస్టులు
నామినేటెడ్ పోస్టుల పందేరం కూడా రేవంత్ మంత్రివర్గ సహచరుల మధ్య అగ్గి రాజేస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేటెడ్ పోస్టులన్నీ మంత్రి శ్రీధర్‌బాబు అనుచరులకే దక్కాయని అదే జిల్లాకు చెందిన మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదవులు ఇచ్చే ముందు మాటమాత్రానికైనా సంప్రందించలేదని సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిరకు ఒక్క కార్పొరేషన్ పదవి కూడా దక్కకపోవడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి విజయంలో కీలకభూమిక పోషించిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తమ నామినేటెడ్ పోస్టులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవులను స్వీకరించేందుకు వారు విముఖతతో ఉన్నట్టు సమాచారం. ఈ అసమ్మతి సెగలన్నీ ఏ క్షణమైనా భగ్గుమనే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అసమ్మతి నేతల ప్రెస్మీట్లపై ఆంక్షలు
రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదురుతున్న అసమ్మతిని మొగ్గ దశలోనే తుంచేసేందుకు టీపీసీసీ అప్రమత్తమైంది. గాంధీభవన్‌లో ప్రెస్మీట్లు పెట్టకుండా కట్టడి చర్యలు చేపట్టింది. ఎవరైనా ప్రెస్మీట్లో ఏ అంశంపై మాట్లాడబోతున్నారో తెలుసుకున్నాకే అనుమతి ఇవ్వాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్‌ను పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ను ఇరకాటపెట్టే నాయకుల ప్రెస్మీట్లకు లైవ్ కవరేజీ ఇవ్వకుండా చూడాలని పార్టీ పెద్దల నుంచి మీడియా ఇన్చార్జికి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.