హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)లు అంటే.. ఒకప్పుడు ఊరు బాగు కోసం.. ఊరి జనం కోసం పాటు పడేవి. కానీ, ఇప్పుడు కొందరు ఆ కమిటీల పేరిట ఊళ్లలో అరాచకం సృష్టిస్తున్నారు. రాజ్యాంగేతర శక్తులుగా మారి శాసిస్తున్నారు. న్యాయవ్యవస్థను, పోలీసు వ్యవస్థను, అధికార వ్యవస్థనూ లెక్కచేయకుండా పెత్తనం చెలాయిస్తున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలపై, కులవృత్తిదారులపై దాష్టీకాలకు పాల్పడుతున్నారు. వెరసి గ్రామ అభివృద్ధి కమిటీలు గ్రామాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాట వింటే సరి.. లేదంటే కుల బహిష్కరణలు విధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాలలో ఇలాంటి ఆగడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే, ఆ కమిటీల వెనుక ఓ సాములోరు ఉన్నారనేది కుల సంఘాల అభియోగం. కమిటీల ఆగడాలపై ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రజాప్రతినిధులు సైతం ప్రశ్నించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
రాజ్యాంగేతర శక్తులుగా వీడీసీలు
గతంలో తాము పుట్టిపెరిగిన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న సదుద్దేశంతో విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో స్థిరపడిన వారు, వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)లను ఏర్పాటు చేసుకునేవారు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా తామే గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నది ఈ వీడీసీల ఏర్పాటు వెనుక ఉద్దేశం. అయితే ఇవేవీ అధికారికంగా గుర్తింపు పొందినవి కావు. గ్రామంలోని ప్రతీ ఒక్కరి నుంచి విరాళాలను సేకరిస్తూ అధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేవి.
అది గతం. అయితే, ఇప్పుడు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో వీడీసీల పేరిట అరాచకశక్తులు రాజ్యం చేస్తున్నాయి. మరీముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో ఈ కమిటీలు ఇప్పుడు సమాంతర ప్రభుత్వాలను నడుపుతున్నాయి. ఆయా కమిటీలు గ్రామాల్లోని గీత కార్మికులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, అరెకటిక, నాయీబ్రాహ్మణ, రజక తదితర కులవృత్తిదారులపై ఆధిపత్యం చేస్తున్నాయనే విమర్శలున్నాయి.
వృత్తిదారులు తాము నిర్ణయించిన మొత్తం ‘హర్గాల్’ చెల్లించాలని, చెప్పిన రేటుకే చేపలు విక్రయించాలని, క్షవరం చేయాలని, బట్టలు ఉతకాలని, మాంసం విక్రయించాలని, ఎట్టిగా తమ భూముల్లో గొర్ల మందలను ఏర్పాటు చేయాలని హుకుం జారీ చేస్తున్నాయి. గ్రామ అభివృద్ధి పేరిట వృత్తిదారుల నుంచి లక్ష రూపాయలను బలవంతంగా వసూలు చేస్తున్నాయి. మాట వినని కులాలపై భౌతికదాడులకు తెగబడటమే కాకుండా, కులబహిష్కరణలను విధిస్తూ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. పోలీసు, అధికార వ్యవస్థనే కాదు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా శాసించేస్థాయికి ఈ కమిటీలు చేరాయి. కమిటీ అనుమతి లేనిదే ఊర్లలో ఎవరూ అడుగుపెట్టని దుస్థితి నెలకొన్నది.
కులబహిష్కరణలు.. దాడులు
వీడీసీల ఆగడాలకు, ఆధిపత్యానికి నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ ఒక ఉదాహరణ. ఆరు నెలల క్రితం కల్లుగీత కార్మికులను అక్కడి వీడీసీ సాంఘిక బహిషరణ చేసింది. గీత కార్మిక పారిశ్రామిక సంఘంలో 53 గౌడ, 7 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. ఆ సొసైటీ నుంచి వీడీసీకి ఏటా రూ.1.5 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా రూ.5 లక్షలు ఇవ్వాలని వీడీసీ డిమాండ్ చేయగా సొసైటీ నిరాకరించింది. దీంతో స్థానిక గౌడ కులస్థులను కాదని వేరే గ్రామస్థులతో కల్లు గీయించాలని వీడీసీ నిర్ణయించింది. దీంతో లైసెన్స్ కలిగి ఉన్న గౌడ కులస్థులు తాము హకులను కోల్పోతున్నామని అక్కడి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఆగ్రహించిన వీడీసీ గౌడ, ఎస్సీ కులస్థులను సాంఘిక బహిషరణ చేసింది. ఆరు నెలలుగా వారిని ఆటోలు ఎకనివ్వడం లేదు. కిరాణ షాపుల్లోకి రానివ్వడం లేదు, పనికి పిలవడం లేదు. ఎవరితోనూ మాట్లాడనివ్వడం లేదు. శ్రీరామనవమి రోజు గుడికి వెళ్లగా, గౌడ కులానికి చెందిన మహిళలను అక్కడి పూజారి, వీడీసీ సభ్యులు గెంటేసి అవమానించారు. ఇదెక్కడి న్యాయమని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడీసీ సభ్యులు గీత కార్మికుల ఈత వనాన్ని తగలబెట్టారు. ఇంత జరిగినా, కేసు పెట్టినా పోలీసులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
బీసీ కమిషన్ ఆదేశించినా దిక్కులేదు
వీడీసీల అరాచకాలపై బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు వివిధ న్యాయవేదికల ద్వారా ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిరుడు బీసీ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించింది. బీసీల సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక బీసీ కుల సంఘాలు వీడీసీల ఆగడాలపై కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు ఫిర్యాదు చేశాయి. దీనిపై చైర్మన్ డీజీపీకి లేఖ రాస్తూ వీడీసీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కానీ చర్యలు తీసుకోలేదు. ఇటీవల మరోసారి డీజీపీకి బీసీ కమిషన్ చైర్మన్ లేఖ రాశారు. వీడీసీల పేరిట పలువురు సామాజిక బహిష్కరణలు, దాడులకు పాల్పడుతున్నారని, వీడీసీల చట్టబద్ధత, గుర్తింపు ఏమిటని ప్రశ్నించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ప్రభుత్వం, డీజీపీ స్పందించలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు, పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ఇదే పరిస్థితి నెలకొన్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి వీడీసీల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని వివిధ కులసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కుల బహిష్కరణలు, జరిమానాతోపాటు భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారని వివరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు సైతం వీడీసీలకే కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న వీడీసీలపై సర్కారు ఎందుకు దృష్టి సారించడం లేదని నిలదీస్తున్నారు. అందులో ఆంతర్యమేమిటి? తెరవెనుక నుంచి స్వా ములోరికి, వీడీసీలలోని పెద్దలకు సహకరిస్తున్నారా? అని కులసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
తెరవెనుక సాములోరు!
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వీడీసీల వెనక ఇప్పటికే అనేక వివాదాలను, ఆరోపణలను ఎదుర్కొంటున్న ఓ సాములోరు ఉన్నారని కులసంఘాల నాయకులు, బాధితులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి వీడీసీలను ఆ సాములోరే తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని చెప్తున్నారు. బడుగు, బలహీనవర్గాలు ఎప్పుడూ బానిసలేనని, శూద్రులకు ఎలాంటి ఆస్తులు ఉండకూడదని వీడీసీలకు బోధిస్తూ, తద్వారా హిందూ ధర్మ పరిరక్షణ పేరిట అరాచకాలు చేయిస్తున్నారని కులసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
హిందూ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకుల నుంచి పూర్తి సహకారం లభిస్తుండటంతో సదరు స్వామీజీ వ్యవస్థలనే శాసించే స్థాయికి చేరారని, వీడీసీ సభ్యులకు ఆ స్వామీజీ ఏం చెప్తే అదే వేదంగా మారిందని చెప్తున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి? ఏ పార్టీకి ఓటేయాలనేది కూడా ఆ స్వామిజీ ఆదేశించడం, వీడీసీ సభ్యులు గ్రామాల్లో తీర్మానం చేయడం, అమలు చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. మాట వినని కింది కులాలను వెలివేయడం, అవమానించడం అంతా ఆ సాములోరి కనుసన్నల్లోనే, ఆయన ఆదేశాలతోనే కొనసాగుతున్నదని కుల సంఘాల నేతలు చెప్తున్నారు.
ఊరూరా ఆగడాలు
ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్‌లోనే..
వీడీసీల ఆధిపత్యం మరీ ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువైపోయిందని కులసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆర్మూర్, మెట్పల్లి, కామారెడ్డి, బోధన్, నిర్మల్ డివిజన్ ప్రాంతంలో బలహీనవర్గాలపై దాడులు ఎక్కువగా కొనసాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగ్గసాగర్, మల్యాల, కొండగట్టు, ఆరెపేట, నడికుడ, ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆసిఫాబాద్, ఖానాపూర్, భైంసా, ముథోల్, బాసర, మెదక్ జిల్లా నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో వీడీసీల ఆకృత్యాలకు అడ్డూ అదుపులేకుండా పోయిందని కులసంఘాలు వివరిస్తున్నాయి.
రాజ్యాంగేతర శక్తిగా వీడీసీలు
గ్రామాభివృద్ధి కమిటీలు రాజ్యాంగేతర శక్తిగా మారాయి. గ్రామాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కమిటీల్లోని అగ్రవర్ణాలు బడుగు, బలహీన వర్గాలపై అనేక దాష్టీకాలకు పాల్పడుతున్నాయి. ప్రజాప్రతినిధులు, కలెక్టర్ల ఆదేశాలు కూడా చెల్లని దుస్థితి నెలకొన్నది. గత కొన్నేండ్లుగా దీనిపై పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు ఈ విషయాలను తీసుకెళ్లాం. వందలసార్లు ఫిర్యాదులు చేశాం. కానీ, పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇకనైనా సత్వరం స్పందించాలి. వీడీసీలను రద్దు చేయాలి.
– శ్రీధర్, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం
వీడీసీల పేరిట ఆరాచకశక్తులు గ్రామాల్లో రాజ్యమేలుతున్నాయి. గ్రామాల్లో బీసీ కుల వృత్తులపై దాడులు చేస్తున్నాయి. అణచివేతకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వపరంగా రావాల్సిన ఫలాలు బీసీలకు అందకుండా అడ్డుకుంటున్నాయి. రాజకీయంగా సరైన ప్రాధాన్యం బీసీలకు దకనివ్వడం లేదు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వీడీసీల ఆగడాలకు అంతులేకుండా పోయింది. సర్కారు ఇకనైనా స్పందించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమ కార్యాచరణ చేపడతాం.
-రాజారాంయాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు