Anganwadi Teachers | హైదరాబాద్ : తమ డిమాండ్లను నెరవేర్చాలని సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన అంగన్వాడీ టీచర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. అంగన్వాడీ టీచర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి, ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరుపై మహిళా టీచర్లు మండిపడ్డారు.
ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.. పోలీసులు మమ్మల్ని ఆడోళ్లు అని కూడా చూడకుండా పట్టుకోరాని చోట పట్టుకుంటూ, ఈడ్చుకెళ్లి కొట్టారని వాపోయారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను ఇక ముందు ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. మేమేమైనా దోచుకుంటున్నామా? మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న పోలీసులు నశించాలి అని శాపనార్థాలు పెట్టారు.
కాంగ్రెస్ మంత్రులు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు అడిగితే మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది రాకండి అంటున్నారు. మ్యానిఫెస్టోలో పెట్టిన రూ. 18,000 జీతం అడుగుతున్నాం తప్పా కొత్త కోరికలు ఏం కోరడం లేదు. అనేక ప్రభుత్వాల హయాంలో మేము ధర్నాలు చేశాం కానీ ఇట్ల కొట్టి నిర్బంధించిన దిక్కుమాలిన ప్రభుత్వం ఇదొక్కటే అని అంగన్వాడీ టీచర్లు ధ్వజమెత్తారు. ప్రీప్రైమరీ పేరిట పిల్లలను వేరే బడులకు తరలిస్తే మా పరిస్థితి ఏంటి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంగన్వాడీ టీచర్లు నిలదీశారు.