Anganwadi Teachers | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని అంగన్వాడీ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 65 ఏండ్లు నిండిన టీచర్లను రెండు నెలల క్రితం తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.1 లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని మాట ఇచ్చింది. నాలుగు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఆ సందర్భంగా మంత్రి హామీ కూడా ఇచ్చారు. కానీ.. నెలలు గడుస్తున్నా ఎలాంటి జీవో విడుదల కావటం లేదని ప్రభుత్వంపై రిటైర్డ్ అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, రెండు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారంగా మారుతున్నదని, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ అంగన్వాడీ టీచర్ల, ఆయాల సంఘం రాష్ట్ర నాయకురాలు నల్లభారతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు.