హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నిశాఖల ఉద్యోగులకు ఒకటో తారీఖునే వేతనాలిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న మాటలు ఉత్తవేనని అంగన్వాడీ సిబ్బంది పేర్కొంటున్నారు. వేతనాల కోసం నెలనెలా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు యూనిఫామ్స్ పంపిణీ కాలేదు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ (2023, సెప్టెంబర్ 12న) చేపట్టింది. తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అప్గ్రేడేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఎన్నికలు పూర్తయ్యి 8 నెలలు దాటినా, కేంద్రం ప్రభుత్వం మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా పరిగణిస్తున్నామని పేర్కొన్నా అప్గ్రేడేషన్ ప్రక్రియ ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది.
కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30శాతం పీఆర్సీని అంగన్వాడీ సిబ్బంది అందుకున్నారు. కేసీఆర్ పాలనలో కేవలం ఏడేండ్ల (2015 నుంచి 2021 వరకు)లోనే దేశంలో ఎక్కడాలేని విధంగా అంగన్వాడీ టీచర్లకు 325శాతం, ఆయాలకు 354శాతం వేతనాలు పెంచిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 శాతం మాత్రమే ఉండేది. మోదీ సర్కార్ వచ్చాక కేంద్రం వాటా 60 శాతానికి తగ్గించింది. రాష్ట్ర వాటాను 40 శాతానికి పెంచింది. పెరిగిన వేతనాల ప్రకారం కేంద్రం వాటా 60 శాతం ఉండాలి. కానీ, టీచర్ల వేతనాల్లో 19శాతం, సహాయకుల వేతనాల్లో కేవలం 17 శాతమే అందిస్తామని చెప్పింది. అయినా అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చెల్లించాలని కేసీఆర్ పట్టుదలతో ఇప్పించారని అంగన్వాడీలు చెబుతున్నారు.