హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎనీమియా (రక్తహీనత)తో బాధపడుతున్నవారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నది. గత ఏడాది నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 174 కోట్ల మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఏటా ఈ సంఖ్య 10-15 శాతం పెరుగుతున్నది. భారతదేశంలో సగటున 25-49 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అయితే, నానాటికీ పెరుగుతున్న ఈ ప్రమాదకర ఎనీమియాను మిల్లెట్లతో అధిగమించొచ్చని ఇక్రిశాట్ అధ్యయనంలో తేలింది. పటాన్చెరు కేంద్రంగా ఇక్రిశాట్ సంస్థ..కొంతకాలంగా సిరిధాన్యాల్లోని పోషకాలు, వ్యాధుల నియంత్రణపై అధ్యయనం చేస్తున్నది. ఈ క్రమంలో రక్తహీనత సమస్యకు మిల్లెట్లు పరిష్కారమార్గమని తేల్చింది. నిత్యం వీటిని తీసుకునేవారి రక్తంలో ఐరన్, సీరం ఫెర్రిటిన్ పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు.
అధ్యయనం సాగిందిలా..
ఈ అధ్యయనానికి పరిశోధకులు వెయ్యి మంది చిన్నారులు, పెద్దవారిని ఎంపిక చేసుకొన్నారు. వీరికి రాగులు, అరికెలు, కొర్రలు, సామలు, ఊదలు, సజ్జలు, జొన్నలు, అండుకొర్రలు, వరిగలులాంటి మిల్లెట్స్‌తో చేసిన ఆహారాన్ని 21 రోజుల నుంచి 4.5 ఏళ్లపాటు ఆహారంగా అందించారు. శరీరానికి అందిన పోషకాలను లెక్కించారు. పెద్దవారితోపాటు చిన్నారుల రక్తంలో ఐరన్, సీరమ్ ఫెర్రిటిన్లాంటి ప్రోటీన్ పదార్థం గణనీయంగా పెరిగినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఎంతో అవసరమైన ఐరన్ చిరుధాన్యాలతో సమృద్ధిగా అందినట్టు తేల్చారు. మిల్లెట్స్‌ను క్రమంతప్పకుండా తీసుకొంటే దీర్ఘకాలంపాటు రక్తహీనతతో బాధపడుతున్న వారిలోనూ ఐరన్స్థాయి పెరుగుతుందని గుర్తించారు. మిల్లెట్లను నేరుగా తిన్నవారి కంటే స్నాక్స్, మొలకలు, పులియబెట్టి, జావ రూపంలో తీసుకొన్నవారిలో ఐరన్ శాతం 5.4 రేట్లు పెరిగినట్టు తేల్చారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 13.2శాతం, సీరం ఫెర్రిటిన్ సగటున 54.7శాతం పెరిగినట్టు కనుగొన్నారు. అధికంగా ఉన్న రక్తహీనతకు కూడా మిల్లెట్లతో చెక్‌పెట్టొచ్చని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇక్రిశాట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఎస్ అనిత తెలిపారు.