(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రైవేట్ సెక్రటరీగా (పీఎస్) ఐఏఎస్ అధికారి ఆండ్ర వంశీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్‌కు వంశీ ఐదేండ్లపాటు పీఎస్‌గా కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ఆండ్ర వంశీ 2011లో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలోని వందలాది గ్రామాల్లో దాదాపు 30 ఏండ్లుగా పరిష్కారంకాని 50 వేల ఫిర్యాదులను కేవలం నాలుగు నెలల్లోనే పరిష్కరించారు.
అలా ఉద్యోగంలో చేరిన అతి తక్కువ కాలంలోనే సమర్థవంతమైన, డైనమిక్ ఆఫీసర్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. యూపీలోని మథుర, ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, ఫిలిబిత్, షాజహాన్‌పూర్ తదితర జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. 2006లో హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో వంశీ బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలం యాక్సెంచర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2008లో ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగం సాధించారు. తర్వాత సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. 2011లో ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు.