Bonus | కూసుమంచి (నేలకొండపల్లి)/ముదిగొండ, డిసెంబర్ 15 : ఆంధ్రా ధాన్యం తెలంగాణలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నది. ఏకంగా వందలాది లారీల్లో అక్రమ మార్గాల్లో వస్తున్నది. తెలంగాణలో వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తుండటం, ఇందుకు తెలంగాణకు చెందిన కొందరు మిల్లర్లు కొమ్ముకాస్తుండటంతో ఆంధ్రాకు చెందిన కొందరు వ్యాపారులు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఆయా శాఖల కంట పడకుండా, పదుల సంఖ్యలో ఉన్న చెక్‌పోస్టులను దాటుకొని ఆంధ్రా ధాన్యం తెలంగాణకు చేరుకుంటుండటం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు 50 నుంచి 100 లారీల చొప్పున 20 రోజులుగా భారీ లోడుతో తెలంగాణలోకి ప్రవేశిస్తుండటాన్ని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల రైతులు గమనించారు.
ఈ క్రమంలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న లారీలను నేలకొండపల్లి మండలం చెరువుమాధారం రైతులు అడ్డగించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రాలోని విజయవాడ, తెనాలి వ్యాపారులు తెలంగాణలోని కొందరు మిలర్లు, దళారులతో కుమ్మక్కై ఈ దందాను సాగిస్తున్నట్టు తెలుస్తున్నది.ఏపీ విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి మీదుగా కొన్ని లారీలు చెరువుమాధారానికి చేరుకుంటున్నాయి.
ఇక్కడి నుంచి ఖమ్మం – కోదాడ హైవే ఎక్కించి మిర్యాలగూడకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో చెరువుమాధారం రైతులు ఈ లారీలను ఆదివారం అడ్డగించి లారీ డ్రైవర్లను ప్రశ్నించారు. డ్రైవర్లు నీళ్లు నమలడంతో విషయం బహిర్గతమైంది. ఇంతలో నేలకొండపల్లి ఎస్సై సంతోశ్ అక్కడికి చేరుకుని రైతులు పట్టుకున్న లారీలను నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరికొన్ని లారీలను చెరువుమాధారం చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. తరువాత వాటిని ఆంధ్రాకు తిరిగి పంపారు. ముదిగొండ మండలం వల్లభి గ్రామం వద్ద శనివారం రాత్రే కొన్ని లారీలను గ్రామస్థులు అడ్డుకొని వెనక్కి పంపించారు.
మాగనూరు/కృష్ణ, డిసెంబర్ 15 : తెలంగాణలోకి అక్రమంగా ధాన్యం తరలిస్తున్న ఆరు లారీలను సీజ్ చేసిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎన్ఫోర్స్మెంట్ డీటీ గుర్రాజరావు, కృష్ణ ఏవో సుదర్శన్‌గౌడ్ కథనం మేరకు.. కృష్ణ మండలం చేగుంట సమీపంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి కర్ణాటక నుంచి తెలంగాణలోకి అక్రమంగా చొరబడుతున్న ఆరు లారీలను ఆపగా.. ఆధారాలు లేకపోవడంతో వాటిని కృష్ణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కర్ణాటక రాష్ట్రం సిరిపూర్ గ్రామం నుంచి తెలంగాణలోని మిర్యాలగూడ శివశంకర ఇండస్ట్రీస్‌కు తరలిస్తున్నట్టు విచారణలో తేలింది.