హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. గురువారం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద జగన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ సంతోష్‌కుమార్, సహా పలువురు సీనియర్ నాయకులు స్వాగతం పలికారు.
కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం, శాలువా అందించిన జగన్.. బీఆర్ఎస్ అధినేత ఆరోగ్యం గురించి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఇరువురి మధ్య సమకాలీన రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు, జాతీయ రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. సీఎం జగన్ వెంట వైసీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం ఉన్నారు.