ORR | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): లెక్కలు రాని ఏబ్రాసి ఏడెక్కం ఎంతరా అంటే ఏడ్చినంత అన్నాడట! అలానే ఉన్నది ‘అంధజ్యోతి’ తీరు . ఔటర్ రింగురోడ్డుపై ఆదివారం అది ప్రచురించిన కథనం అంతకంటే అధ్వానంగా ఉంది. ‘మబ్బుల్ల నీళ్లు చూసి ముంత వొలకబోసుకున్న’ చందంగా ‘అంధజ్యోతి’ 30 ఏండ్లకంటూ కాకిలెక్కలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఏర్పడింది మొదలుకుని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, రాష్ర్టాన్ని, ప్రభుత్వాన్ని బద్నాం చేయడాన్నే ‘అంధజ్యోతి’ పనిగా పెట్టుకుంది. ‘బరితెగించిన కోడి బజార్ల గుడ్డు పెట్టిందన్నట్టు’ తన తెలంగాణ వ్యతిరేకత ఎన్నిసార్లు బట్టబయలైనా దానికి సిగ్గు రావడం లేదు. ‘బొంకరాబొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత’ అంటూ లేని నష్టాన్ని ఉన్నట్టు, ఉన్న లాభాన్ని లేనట్టు చూపించేందుకు ‘అంధజ్యోతి’ అష్టకష్టాలు పడుతున్నది. గత 9 ఏండ్లుగా ఇసుక మొదలుకుని అనేక రంగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించింది. గణాంకాల సాక్షిగా అవి రుజువయ్యాయి. ‘అంధజ్యోతి’ రాతలు తప్పని కూడా అనేకమార్లు తేటతెల్లమైంది. అయినా ‘వెనకటి గుణమేల మాను’అన్నట్టుగా అంధజ్యోతి ఔటర్లో ఏదో జరిగిందనే భ్రమ కల్పించడానికి కట్టు కథనాలు వేస్తున్నది. హిట్ అండ్ రన్ పద్ధతిలో బట్టగాల్చి మీదేస్తా.. తీసేసుకో, బురదజల్లుతా… కడుక్కో అనే పద్ధతి పుచ్చు జర్నలిజం చేస్తున్నది. ఔటర్ రింగురోడ్డు లీజులో అసలేం జరిగింది? నిజంగా అందులో మతలబో, మోసమో ఉందా? హిట్ అండ్ రన్.
ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) లీజుపై ఆంధ్రజ్యోతి కుట్రలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆ పత్రిక ప్రచురించిన మరో వార్త పూర్తిగా ప్రజలను తప్పదోవ పట్టించేదిగా ఉన్నది. తిమ్మిని బమ్మిని చేసి అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు ఆ పత్రిక విఫలయత్నం చేసింది. ఈ లీజువల్ల ప్రభుత్వానికి వందల కోట్లు లాస్ అని పది రోజుల క్రితం ఓ వార్తను వండి వార్చిన ఆ పత్రిక, ఆదివారం ఏకంగా లక్షల కోట్లు నష్టం అనేంతగా అబద్ధాలతో రెచ్చిపోయింది. ఓఆర్ఆర్పై టీవోటీ లీజు ఒప్పందం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా చేసుకొన్నా, ఇందులో ఏదో పెద్ద తప్పు జరిగిందన్న అపోహలు సృష్టించేందుకు ఆ పత్రిక శతవిధాలా ప్రయత్నిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్హెచ్ఏఐ రూపొందించిన నియమాల ప్రకారమే తెలంగాణ ఓఆర్ఆర్ను లీజుకు ఇచ్చింది. రోడ్డుపై ఏటా పెరిగే ట్రాఫిక్‌ను 5 శాతంగా, టోల్ చార్జీల పెంపు 5 శాతంగా ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఓఆర్ఆర్ను లీజుకు ఇచ్చారు.
దాచిందేమీ లేదు
2020 సెప్టెంబర్ 10న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ, ఆర్థిక, న్యాయ శాఖలతోపాటు నీతి ఆయోగ్ వంటి కమిటీలతో దేశంలో టీవోటీ విధానంలో చేపట్టే ప్రాజెక్టులపై కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే టీవోటీ ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకోవటంతోపాటు టెండర్ ప్రక్రియ ముగిసేవరకు బేస్‌ప్రైస్ వెల్లడించడానికి వీల్లేదని కేంద్రం నిర్ణయించింది. ఆ ఆదేశాలనే ఓఆర్ఆర్ లీజ్ ప్రక్రియలోనూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ గ్లోబల్ టెండర్లో 11 కంపెనీలు బిడ్డింగ్ డాక్యుమెంట్లను కొనుగోలు చేశాయి. ఇందులో 7 భారీ నిర్మాణ సంస్థలు మాత్రమే ట్రాఫిక్ సర్వే, ఆదాయ అంచనాలపై సమగ్ర అధ్యయనం చేసుకోగా, 142 రోజుల పాటు సుదీర్ఘ కాలం బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆయా కంపెనీలు కూడా సమగ్ర సమాచారంతో బిడ్డింగ్‌లో పాల్గొన్నాయని, ఇందులో గోప్యతకు తావు లేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ బిడ్డింగ్‌లో అత్యధిక ధరకు కోట్ చేసిన కంపెనీకే లీజు ఖరారు చేశారు. 2014 నుంచి 2018 మే వరకు, 2019 మార్చి నుంచి ఇప్పటివరకు దాదాపు 8 ఏండ్లుగా ఓఆర్ఆర్ టోల్ ప్లాజాలను నిర్వహిస్తున్న ఈగల్ ఇన్ఫ్రా కూడా అత్యధిక ప్రైస్‌బిడ్ కంటే 23 శాతం తక్కువకు.. అంటే రూ.5,680 కోట్లకే టెండర్ వేసింది.
ఔటర్ రింగురోడ్డును నిర్వహణ వ్యయంతో కలిపి 30 ఏండ్ల కాలానికి లీజుకిచ్చుకుంటే వచ్చే ప్రభుత్వాలు ఏం చేయాలి? అన్నది అంధజ్యోతి ప్రశ్న. మరి మోదీ ప్రభుత్వం పీఎస్‌యూలను మొత్తంగా అమ్మేస్తుంటే, మిగతా ప్రభుత్వాలు ఏం చేయాలని ఎందుకు అడగడం లేదు? ఔటర్ది అమ్మకం కాదు; లీజు మాత్రమే!
30 ఏండ్ల కాలానికి లీజుకివ్వడం వల్ల ఖజానాకు భారీ నష్టం కలిగిందన్నది అంధజ్యోతి రాత. దాని రాతలో దానికే స్పష్టత లేదు. టోల్ వసూళ్లలో 15 శాతం వృద్ధి ఉంటుందని మొదటి పేజీలో రాసి, 30 ఏండ్లకూ ఆమేరకు లెక్క వేసి, 2.7 లక్షల కోట్ల రాబడి అని తేల్చింది. 10 పేజీలోకి వచ్చేసరికి మొదటి పదేండ్లు 15 శాతం వృద్ధి, తర్వాత 20 ఏండ్లు 7.5 శాతం వృద్ధి అని రాశారు. ఇదీ దాని పరిజ్ఞానం!
వాళ్లేసిన లెక్కల ప్రకారమే మాట్లాడుకుందాం. ‘అంధజ్యోతి’ ఎంతసేపూ వచ్చే ఆదాయం గురించే మాట్లాడుతున్నది తప్ప, వచ్చిన దాని గురించి చెప్పదు. లీజు రూపంలో ముందే ఏకమొత్తంగా వచ్చిన 7,380 కోట్లకు, 9 శాతం మామూలు వడ్డీ, లేదా12 శాతం బ్యాంకు కాంపౌండింగ్ వడ్డీ వేసుకున్నా 30 ఏండ్లలో అది 2,48,786 కోట్లు. ఇక నష్టం ఎక్కడ? అంధజ్యోతి ఈ లెక్కెందుకు చెప్పదు?
ఆంధ్రజ్యోతి చెప్పినట్టు మొదటి పదేండ్లు 15 శాతం, తర్వాత 20 ఏండ్లు 7.5 శాతం వృద్ధి లెక్కన చూస్తే మొదటి పదేండ్లలో 12,655 కోట్లు, మొత్తం 30 ఏండ్లలో 1,14,730 కోట్లు ఆదాయం వస్తుంది. ఇందులో మెయింటెనెన్స్‌కి 14,500 కోట్లు పోతుంది. అంటే కంపెనీకి మిగిలేది లక్షా 230 కోట్లు. మరి ప్రభుత్వానికి అడ్వాన్స్‌గా వచ్చిన 7380 కోట్లకు, అత్యంత మాడరేట్‌గా 10 శాతం వడ్డీ వేసుకున్నా 30 ఏండ్లకు అది 1,35,483 కోట్లు! ఇక నష్టం ఎక్కడ? అయినా వేల కోట్ల డబ్బు ఎవడైనా ఊరికే ముందే ఇస్తాడా? దాని వడ్డీ గురించి, వచ్చే లాభం గురించి అంధజ్యోతి ఎందుకు రాయదు?
తప్పు-1 కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ఔటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం 30 ఏండ్ల లీజుకిచ్చింది. విధానమే తప్పైతే అంధజ్యోతి మోదీ సర్కారును ఎందుకు ప్రశ్నించదు?
తప్పు-2 ఈ విధానం ప్రకారమే కేంద్రం అనేక హైవేలను సుదీర్ఘ కాలానికి ప్రైవేటుకు లీజుకిచ్చింది. ఆ లెక్కన దేశ ఖజానాకు ఎన్ని లక్షల కోట్ల నష్టం సంభవించినట్టు? అంధజ్యోతి దానిపై అడగదేం?
తప్పు-3 ఔటర్ లీజు పూర్తి పారదర్శకంగా గ్లోబల్ టెండరింగ్ విధానంలో జరిగింది. 11 సంస్థల్లో ఎక్కువ కోట్ చేసిన వారికి లీజు దక్కింది. దక్కించుకున్నది కూడా రాష్ర్టానికి సంబంధం లేని కంపెనీ. ఇక ఇందులో గూడుపుఠాణీకి ఆస్కారం ఏముంది?
తప్పు-4 ఔటర్‌ను 8 ఏండ్లపాటు నిర్వహించిన ఈగల్ ఇన్ఫ్రా కంపెనీకి వాహనాల రద్దీ, దాని పెరుగుదలపై పూర్తి అవగాహన ఉన్నది. అన్ని లక్షల కోట్ల ఆదాయమే ఉంటే, ఈగల్ ఇన్ఫ్రా రూ.5,634 కోట్లు మాత్రమే కోట్ చేసి టెండర్‌ను ఎందుకు వదులుకున్నట్టు?
తప్పు-5 ఔటర్‌ను మొత్తంగా ఎవరికో రాసిచ్చినట్టు అంధజ్యోతి కట్టుకథలు అల్లుతున్నది. ఔటర్‌పై ఆదాయం బేస్‌ప్రైస్ కంటే అసాధారణంగా పెరిగినా, తగ్గినా పునస్సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. లీజు కాలపరిమితిని మూడేండ్లకు కానీ, ఐదేండ్లకు కానీ ప్రభుత్వం తగ్గించవచ్చు.
తప్పు-6 కేంద్ర ప్రభుత్వం హైవేలపై టోల్ చార్జీలను 2023 ఏప్రిల్ 1 నుంచి పెంచింది. దానికి అనుగుణంగానే ఔటర్పైనా టోల్ చార్జీలు పెరిగాయి. లీజు టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది 2022 నవంబర్ 9న! ఆర్నెల్ల తర్వాత పెరిగే చార్జీలను బేస్‌ప్రైస్‌లో ఎలా పరిగణనలోకి తీసుకుంటారు?
తప్పు-7 బేస్‌ప్రైస్ గోప్యతపై అంధజ్యోతి కల్లబొల్లి కబుర్లు చెప్తున్నది. టీవోటీ కింద చేపట్టే ప్రాజెక్టుల మీద 2020 సెప్టెంబర్ 10న నిర్వహించిన సమావేశంలో టెండర్ ప్రక్రియ ముగిసే దాకా బేస్‌ప్రైస్ వెల్లడించవద్దని కేంద్రం ఆదేశించింది. ఎన్హెచ్ఈఐ ఇప్పటివరకు దీన్నే పాటిస్తూ వస్తున్నది.
ప్రతి పదేండ్లకోసారి లీజుపై సమీక్ష ఓఆర్ఆర్ను ఒకేసారి 30 ఏండ్ల లీజుకు అప్పగించినా దానిపై ప్రతి పదేండ్లకోసారి సమీక్ష చేసి లీజు గడువును తగ్గించేలా నిబంధన ఉన్నదని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణపై హెచ్ఎండీఏ నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఓఆర్ఆర్పై ట్రాఫిక్ సాధారణం కంటే ఎక్కువ పెరిగితే లీజు కాలవ్యవధిని తగ్గించే అవకాశం ఉన్నది. 10, 20 సంవత్సరాల్లో ఈ సమీక్ష ఉంటుంది. ఈ లెక్కన ట్రాఫిక్ పెరిగితే వచ్చే ఆదాయంలో మార్పు ఉంటుంది.
ఇవీ వాస్తవాలు
టీవోటీ విధానంలో ఎన్హెచ్ఏఐ అప్పగించిన రోడ్లు