Andhrajyothy | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రగతి పరుగు ఆంధ్రజ్యోతికి కంటగింపుగా మారింది. తొమ్మిదేండ్లలోనే అభివృద్ధిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరడం ఆ పత్రిక జీర్ణించుకోలేకపోతున్నది. దేశమంతా కీర్తిస్తున్న తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూ అబద్ధాలతో అక్షరాలను పేర్చి చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నది. రాష్ట్ర ప్రగతిని కేంద్ర ప్రభుత్వమే గుర్తించి అనేక అవార్డులు ఇస్తున్నా.. అవన్నీ వదిలేసి అబద్ధాలను వండి వారుస్తున్నది. అప్పుల కట్టడిలో తెలంగాణ మార్గం ఆదర్శమని, వడ్డీల చెల్లింపులో దేశానికే తెలంగాణ రోల్ మాడల్ అని ఆర్బీఐ నివేదికలే స్పష్టం చేశాయి. 2019 నుంచి మూడేండ్లపాటు వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి నిధులు తెలంగాణకు ఇవ్వలేదని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా అంగీకరించింది. ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున మూడేండ్లకు రూ.1,350 కోట్లు ఇంకా ఇవ్వాల్సి ఉన్నదని తెలిపింది. ఇక.. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో తెలంగాణపై కేంద్రం వివక్ష పరాకాష్టకు చేరిందని చెప్పడానికి కాగ్ నివేదికలే సాక్ష్యం. బీజేపీ పాలిత రాష్ర్టాలకు కోట్లు కుమ్మరిస్తూ.. తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదని 2015 నుంచి 2023 వరకు ప్రతి కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం మోయలేని అప్పులు చేస్తున్నదని ఆంధ్రజ్యోతి అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నది.
ప్రతిపైసా అభివృద్ధి, సంక్షేమాలకే
తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లకుపైగా అప్పు చేసిందని ఇటీవల ఆంధ్రజ్యోతి ఓ కథనం రాసింది. కానీ, ఆ అప్పుతో ప్రభుత్వం ఏం చేసిందో మాత్రం చెప్పలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అవాస్తవాలను వండి వారుస్తున్నది. తెలంగాణ సర్కారు అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులతో పాలన ప్రారంభించింది. నిధులను సమీకరించి, అప్పులు చేసి.. అభివృద్ధి, సంక్షేమం కోసం వెచ్చించింది. ప్రభుత్వం దగ్గరున్న ప్రతి రూపాయిని రెట్టింపు చేసే ప్రణాళికతో ముందుకెళుతున్నది. అందుకే అనతికాలంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా అవతరించింది. వ్యవసాయం మొదలు పరిశ్రమల స్థాపన వరకు అన్నింటా ముందంజలో నిలుస్తున్నది. కేంద్రం శత్రువైఖరితో రాష్ర్టాభివృద్ధికి ఏమాత్రం సహకరించుకున్నా.. సీఎం కేసీఆర్ పటిష్ఠ ఆర్థిక ప్రణాళికతో రాష్ర్టాన్ని దేశానికి రోల్ మాడల్‌గా నిలిపారు.
ఆర్బీఐ నివేదికే సాక్ష్యం
అప్పులు చేసే విషయంలో దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ 23వ స్థానంలో ఉన్నది. ఇవేమీ ‘ఆంధ్రజ్యోతి కండ్లకు కనిపించ లేదు. జీఎస్డీపీకి మించి కొన్ని రాష్ర్టాలు అప్పులు చేస్తున్నాయని ఇటీవలే ఆర్బీఐ హెచ్చరించింది. రాష్ట్రాల ఆర్థిక క్షీణతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ జాబితాలో తెలంగాణ లేనేలేదు. పరిమితికి లోబడే తెలంగాణ అప్పులు చేస్తున్నదని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆంధ్రజ్యోతికి ఈ నిజమూ కనిపించలేదు. ఆర్బీఐ హెచ్చరించిన జాబితాలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ర్టాలున్నాయి. రాష్ట్రాల అర్థిక పరిస్థితి క్షీణతకు సొంత పన్నుల ఆదాయం కంటే అధికంగా ఉచిత పథకాలు, సబ్సిడీలకు ఖర్చు చేయడమే కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. పరిస్థితిని చకదిద్దుకోవడానికి దీర్ఘకాలిక వ్యూహాలు అమలుచేయకుంటే మున్ముందు మరింత గడ్డు పరిస్థితులను ఎదురొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తెలంగాణ అప్పుల పాలైందన్న ఆంధ్రజ్యోతి కథనంలో వాస్తవమే లేదని ఆర్బీఐ నివేదికతో తేటతెల్లమైంది.
వడ్డీల కట్టడిలో తెలంగాణ ఆదర్శం
అప్పులకు చెల్లించే వడ్డీలను తగ్గించటంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే.. తెలంగాణ మాత్రం సొంత రాబడులతో ఆర్థికంగా బలపడుతుంది. కేంద్రంలోని మోదీ విధానాలతో ప్రజల ఆదాయ మార్గాలు తగ్గడం, ఖర్చులు అమాంతం పెరగడంతో రాష్ర్టాలకు రాబడి గణనీయంగా తగ్గుతున్నది. అయితే.. తెలంగాణ రాష్ట్రం అప్పుచేసిన ప్రతి రూపాయిని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తూ మళ్లీ సంపదను సృష్టిస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలు మాత్రం సంపద సృష్టిలో బోల్తా పడుతున్నాయి. ప్రణాళిక లేకపోవడం, సంపదను ఎలా సృష్టించుకోవాలో తెలియకపోవడంతో అప్పులు, వాటితోపాటే వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. నిధుల సేకరణలో తడబడుతూ ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసేస్తున్నాయి. ఆర్బీఐ హ్యాండ్ బుక్-2022 లెక్కల ప్రకారం అధిక మొత్తంలో వడ్డీలు చెల్లిస్తున్న రాష్ర్టాల జాబితాలో డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో ఉన్న రాష్ర్టాలు అగ్రస్థానంలో ఉన్నాయి. 2015లో తెలంగాణ చెల్లించిన వడ్డీ రూ.5,227 కోట్లు. 2016లో రూ.7,558 కోట్లు, 2017లో రూ. 8,609 కోట్లు, 2018లో రూ.10,836 కోట్లు, 2019లో రూ.12,586 కోట్లు, 2020లో రూ.14,386 కోట్లు, 2021లో రూ.14,615 కోట్లు, 2022లో రూ. 17,584 కోట్లు.
P
గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో కోతలు
కేంద్రం నుంచి రెండు పద్దుల రూపంలో రాష్ట్రాలకు ఆర్థిక ఆసరా అందుతున్నది. ఇందులో రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన పన్నుల్లో వాటా ఒకటైతే, వివిధ పథకాల అమలుకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరొకటి. ఈ రెండింటిలోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతూనే ఉన్నది. తెలంగాణ ఆర్థిక పరుగుకు అడుగడుగునా మోకాలడ్డుతున్నది. నీళ్ల నుంచి నిధుల వరకు అన్నింటా అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్ చెప్పినా, విభజన చట్టం స్పష్టంగా పేర్కొన్నా.. తెలంగాణ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా..కేంద్ర ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. కేంద్రం నుంచి తెలంగాణకు ఇప్పటి వరకు రూ.34,149 కోట్లు రావాల్సి ఉన్నది. కానీ ఏవో కుంటిసాకులు చూపుతూ ఆ నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పరిస్థితి మరీ దారుణం. రూ.41,001 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా, కేంద్రం విదిల్చింది కేవలం రూ.13,087 కోట్లు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం కావాల్సినంత ఇచ్చేశారు. ఫిబ్రవరి వరకే గుజరాత్‌కు 111 శాతం నిధులు ఇచ్చేశారు. మిగిలిన బీజేపీ పాలిత రాష్ర్టాలన్నింటికీ తెలంగాణ కంటే ఎంతో మెరుగ్గా అందజేశారు. ఆంధ్రజ్యోతి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టేసి.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టుగా రాసింది. ఇది రాష్ర్టాల హక్కు కాదని చెప్తున్నది. హక్కు కానప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరద ఎలా పారుతున్నది?
పన్నుల వాటాలోనూ భారీ కుదింపు
తెలంగాణకు రావాల్సిన కేంద్ర పన్నుల వాటాను కేంద్రం భారీగా కుదించింది. 2022-23లో కేంద్ర పన్నుల వాటాగా తెలంగాణకు 18 వేల కోట్లకుపైగా అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. కేంద్రం దీన్ని రూ.12,407 కోట్లకు కుదించింది. ఆ మొత్తం సైతం సక్రమంగా ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నది. కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చిం ది రూ.11,750 కోట్లు ఇచ్చింది. ఇంకా రూ.657 కోట్లు రావాల్సి ఉన్నది. మార్చి నెలలో ఆ నిధులు రావాల్సి ఉన్నది. ప్రతిసారీ ఏదో ఒక సాకును చూపు తూ జాప్యం చేస్తున్నది. దీనితోపాటు కేంద్రం నుంచి తెలంగాణకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు తదితరాలు అన్నీ కలిపి రూ.34,149 కోట్లు రావాల్సి ఉన్నది. ఈ నిధులు తెలంగాణకు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారస్ చేసి ఏండ్లు గడిచినా.. కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నది. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధుల విషయంలో కానీ, కేంద్రం చేస్తున్న అన్యాయంపైనగానీ ఏ రోజూ నోరు మెదపని ఆంధ్రజ్యోతి, తెలంగాణ ఆర్థిక ప్రగతిపై మాత్రం అక్కసు వెళ్లగక్కుతూ అబద్ధపు కథనాలు ప్రచురిస్తున్నది.
అభివృద్ధికే కేటాయింపులెక్కువ
కేంద్రం ఆర్థికంగా అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నా, తెలంగాణ మాత్రం సొంతకాళ్లపై నిలబడుతూ అద్భుత వృద్ధి సాధిస్తున్నది. ఏ లక్ష్యంతోనైతే రాష్ట్రాన్ని సాధించుకొన్నామో.. ఆ దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. రాబడుల్లో అత్యధిక మొత్తాన్ని అభివృద్ధి పథకాలపై ఖర్చు చేస్తుండటంతో ఆర్థికంగా రోజురోజుకూ మరింత బలపడుతున్నది. ప్రజల ఆదాయాన్ని పెంచడం ద్వారా రాబడిలో వృద్ధిరేటును నమోదు చేసుకోవడంలో తెలంగాణ విజయవంతమైంది. బడ్జెట్ కేటాయింపుల్లో అభివృద్ధి వ్యయానికే రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గత రెండేండ్లుగా బడ్జెట్లో అభివృద్ధి పనులకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్లో 77.4 శాతం నిధులు (రూ.1.98 లక్షల కోట్లు) అభివృద్ధి వ్యయానికి కేటాయించింది. 2021-22లో ఈ కేటాయింపులు 76.3 శాతంగా, 2020-21లో 69.7 శాతంగా ఉన్నాయి. 2020-21లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.67,963 కోట్ల రాబడి వచ్చింది. 2021-22లో ఇది రూ.1,09,992 కోట్లకు ఎగబాకింది. 2022-23లో రూ.1.25 లక్షల కోట్లకు చేరువైంది. ఇలా వచ్చిన రాబడిని మళ్లీ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు వెచ్చిస్తూ ఏటికేడు తెలంగాణ ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నది. అయినా ఇవన్నీ ఆంధ్రజ్యోతికి కనిపించలేదు.
వివిధ రాష్ర్టాల బడ్జెట్లో అభివృద్ధి వ్యయం ఇలా
రాష్ట్రం: శాతం
తెలంగాణ: 78
ఉత్తరప్రదేశ్: 62
మహారాష్ట్ర: 64
రాజస్థాన్: 70
కర్ణాటక :75
గుజరాత్ : 70