మన్సూరాబాద్, అక్టోబర్ 27: రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల దళితులు అసంతృప్తితో ఉన్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో రెచ్చగొట్టేలా కథనాలు ప్రచురించిన ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు భావన, వాసుదేవ్ డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలను నిరసిస్తూ సోమవారం ఎల్బీనగర్లో ఆ పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఊహాజనిత వార్తలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వేమూరి రాధాకృష్ణ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ మెప్పు కోసం తప్పుడు రాతలు రాయడాన్ని మానుకోవాలని హితవుపలికారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ‘ఆంధ్రజ్యోతి’ పత్రికతోపాటు ఏబీఎన్ చానల్‌ను తెలంగాణ నుంచి తరిమికొడతామని హెచ్చరించారు.