హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. తెలంగాణ భాషలో ఉన్న పాటలకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ లభిస్తున్నది. ఇది ఆంధ్రాలోని కొందరు కుట్రదారులకు కంటగింపుగా మారి మళ్లీ తెలంగాణ వ్యవహారికంపై దాడి చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో తెలంగాణ ఫోక్ సాంగ్ దుమ్మురేపింది. సోమవారం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1 ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గాయని అదితి భవరాజు పాడిన ‘ఏష నాగుల కట్టమీద’ పాట సభికులను ఊర్రూతలూగించింది.
ఈ సభకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో పాడగా వేదికపై ఉన్నవారితో పాటు, హాజరైన సీమాంధ్ర ప్రజలను కూడా ఈ పాట కట్టిపడేసింది. పాటను ఆలపిస్తున్నంతసేపు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు సభికులు చప్పట్లు కొడుతూ ఈలలతో మైమరచిపోవడం కనిపించింది. ఏపీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఆలపించిన ఏషనాగుల పాట సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే లక్షలాది మంది ఈ ఫోక్‌సాంగ్ వీడియోను ఫేస్బుక్, ఇన్‌స్టా, ఎక్స్‌లో షేర్ చేయడం ఈ పాటకు లభించిన ఆదరణను ప్రతిబింపజేసింది. తెలంగాణ పాటపై ఆంధ్రాలోని కొందరు కక్షతో వెటకారపు వ్యాఖ్యలు చేసినా.. హేళన చేస్తున్నా అక్కడి ప్రజలు మాత్రం తెలంగాణ పాటకు జేజేలు పలుకడం తెలంగాణ సాహిత్యం.. మాండలికం అందానికి దక్కుతున్న ఆదరణకు అద్దంపడుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మాండలికం.. తెలంగాణ యాస.. తెలంగాణ వ్యవహారికానికి హేళనే ఎదురైంది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా కొందరు తెలంగాణ వ్యతిరేకులు అప్పటిలాగే వ్యవహరి స్తున్నారు. మొన్న ఇడుపు కాయితం సినిమా టైటిల్‌పై వివాదం తరహాలోనే ఇప్పుడు ‘ఒక్క పదమైనా సరిగ్గా అర్థమయ్యేలా ఉన్నదా?.. నాని సినిమాను కాస్త తెలుగులో కూడా రిలీజ్ చేయండయ్యా’ అంటూ ఓ ఆంధ్రా వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టుపెట్టి తన దుర్బుద్ధిని చాటుకున్నాడు.