Bhadrachalam | భద్రాచలం, డిసెంబర్ 16: భద్రాద్రి రామయ్య ఆలయంలో భక్తులకు అందించే లడ్డూను ప్రభుత్వరంగ సంస్థల నుంచి సేకరించిన నెయ్యితోనే తయారు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆలయ అధికారులు బేఖాతరు చేశారు. గత పదేండ్ల నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న ప్రైవేటు సంస్థను కాదని, ప్రభుత్వ సంస్థ నుంచి సేకరించాలన్న అధికారిక ఉత్తర్వులనూ కాదని పక్క రాష్ర్టానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తిరుమల తిరుపతి లడ్డూకు సరఫరా అవుతున్న నెయ్యిలో జంతువుల కొవ్వును గుర్తించినట్టు వార్తలొచ్చిన నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అప్రమత్తమై, రాష్ట్రంలోని అన్ని ఆలయాలు విజయ డెయిరీ నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఏడాది జూన్‌లో భద్రాద్రి దేవస్థానంలో నెయ్యి సరఫరాకు టెండర్లను ఆహ్వానించారు.
కాగా, గత పదేండ్ల నుంచి భద్రాద్రి ఆలయానికి నెయ్యి సరఫరా చేస్తున్న కరీంనగర్ డెయిరీ సంస్థ జీఎస్టీతో కలిపి కిలోకు రూ.610కి టెండరు వేసింది. ఆంధ్రలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడానికి చెందిన రైతు డెయిరీ సంస్థ రూ.534.24కు టెండర్ వేసి కాంట్రాక్టు దక్కించుకుంది. ప్రధాన ఆలయాలకు రెండేండ్లపాటు నెయ్యి సరఫరా చేసిన అనుభవం, ఏడాదికి రూ.10 కోట్ల టెండర్లు వేసి ఉండాలన్న నిబంధనలో రైతు డెయిరీ సంస్థ అర్హత సాధించలేదు. అవచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు నెయ్యి సరఫరా చేసే విధంగా సదరు ప్రైవేటు డెయిరీతో ఒప్పందం చేసుకున్నారు. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో దేవాదాయశాఖ దేవాదాయశాఖ చర్యలకు ఉపక్రమించింది.
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరుచేస్తూ భద్రాద్రి ఆలయ అధికారులు ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టును కట్టబెట్టడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆలయ ఈఓపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ కమిషనర్‌ను ఆదేశించారు. రాష్ట్రంలోని ఏదైనా ఆలయంలో ఇటువంటివి జరిగి ఉంటే సమీక్ష నిర్వహించి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.