హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనా, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయితో కలిసి శ్రీవారిని బుధవారం దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని పరిశీలించారు. వారాహి డిక్లరేషన్ బుక్‌తో ఆలయం వెలుపలకు పవన్ రావడాన్ని భక్తులు ఆసక్తిగా గమనించారు. అంతకుముందు చిన్న కుమార్తె పొలెనా అంజనా స్వామివారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా డిక్లరేషన్ పత్రాలపై పవన్ సంతకాలు చేశారు. తిరుమలలో చిరుతల నుంచి రక్షణకు అటవీ శాఖ చేపట్టిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురువారం సాయంత్రం జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద నిర్వహించే వారాహి సభలో పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు.