Residential Schools | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : అనాథలు, నిరాశ్రిత, విధివంచిత బాలురకు ఆశ్రయాన్నిస్తున్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు (యూఆర్ఎస్) అనాథల్లా మారాయి. వీటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా పాఠశాలల్లోని బాలురు కడుపునిండా తిండికి నోచడం లేదు. అక్కడి అరకొర వసతులు, అధ్వాన పరిస్థితులు కలవరపెడుతున్నాయి. బడిబయటి బాలురను బడిబాట పట్టించి వారి బంగారు భవితకు బాటలు వేయడానికి 2017లో జిల్లా కేంద్రాల్లో అర్బన్ రెసిడెన్షియల్ సూళ్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విధి వంచితులు, అనాథలు, బాల వలస కార్మికులు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన బాలుర కోసం వీటిని నెలకొల్పారు. బాలికలకు కేజీబీవీల లాంటివే బాలుర కోసం, పూర్తి రెసిడెన్షియల్ స్థాయిలో యుఆర్ఎస్లను ప్రారంభించారు. రాష్ట్రంలో 29 యూఆర్ఎస్లు ఉండగా, వీటిల్లో 2,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరి కోసం 173 మంది సీఆర్టీలను నియమించారు. 84 కేజీబీవీల్లో ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు. కానీ, యూఆర్ఎస్లను 8వ తరగతి వరకే నిర్వహిస్తున్నారు. ఒక్క యూఆర్ఎస్కు కూడా అప్గ్రేడ్ చేయలేదు. ములుగు, నారాయణపేట, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్త యూఆర్ఎస్లను ప్రారంభించాల్సి ఉండగా, ఇంతవరకు ఆరంభానికి నోచుకోలేదు.
అర్బన్ రెసిడెన్షియల్ సూళ్లలోని ప్రతి విద్యార్థికి కేవలం నెలకు రూ.1,049.50, అంటే రోజూ రూ.35 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ మెస్చార్జీలతో నాణ్యమైన భోజనం పిల్లలకు అందించలేకపోతున్నారు. 2022-23 విద్యా సంవత్సరం వరకు కేజీబీవీ విద్యార్థినులతో సమానంగా మెస్చార్జీలను చెల్లించేవారు. రానురాను కేజీబీవీ విద్యార్థినులకు రూ.1,225 ఇస్తుండగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులకు మాత్రం కేవలం రూ.1049.50తోనే సరిపెడుతున్నారు. రోజువారీ మెనూను రూపొందించనేలేదు. ఏరోజు ఏమి పెట్టాలో, ఎన్ని గ్రాములు ఇవ్వాలో సూచించనేలేదంటే ఈ స్కూళ్ల పట్ల అధికారులెంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
యూఆర్ఎస్లు ఏర్పాటై ఏడేండ్లు గడుస్తున్నా స్థల సేకరణ, సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. ఖమ్మం మినహా మిగతా పాఠశాలలు అద్దె భవనాల్లో, పాతబడిన ప్రభుత్వ భవనాల్లో, అరకొర వసతుల మధ్యే కొనసాగుతున్నాయి. 13 సర్కారు బడుల ప్రాంగణాల్లో, 11 అద్దె భవనాల్లో, 5 ఇతర భవనాల్లో కొనసాగుతున్నాయి. ఏ ఒక పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, డార్మెటరీలు, వంటగది, భోజనశాలలు లేవు. విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, బెడ్ షీట్లు, దుప్పట్లు, ఇవ్వడమే లేదు. మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్లు గానీ, చలికాలంలో విద్యార్థులకు వేడినీటి కోసం హీటర్లు గానీ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు సమీక్షించి, తగు వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.