తెలంగాణ అభివృద్ధి వెలుగులు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి రాష్ట్ర ప్రగతిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. నిత్యశంకితులు.. నిరాశోపహతులు అన్నట్టుగా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుండగా, దేశ, విదేశీ ప్రముఖులు తెలంగాణలో అభివృద్ధిని వేనోళ్ల కొనియా డుతున్నారు. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి, పర్యావరణవేత్త ఎరిక్ సోల్హిమ్ తదితరులు బుధవారం తెలంగాణలో వివిధ రంగాల అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధిపతి ఆనంద్ మహీంద్రా బుధవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్‌ను ఆ సంస్థ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణలోని ప్లాంట్‌ను సందర్శించడం చాలా సంతోషం కలిగించింది. ఇక్కడ ప్రపంచశ్రేణి ట్రాక్టర్లు తయారవుతున్నాయి. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి కాబోతున్నాయి. మా బృందం ఈ పరిణామం పట్ల చాలా సంతోషంగా ఉన్నది. మా ప్రతిష్ఠాత్మకమైన కే 2 ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ఆ ప్రాజెక్టు కోసం మీలాగే మేము కూడా ఎదురుచూస్తున్నాం సిక్కా గారు. అది సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నాం. ప్లాంటు విస్తరిస్తున్నందుకు, మాకు ఎప్పటికప్పుడు మద్దతుగా నిలుస్తున్న ఆనంద్ మహీంద్రాగారికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన ఆనంద్ మహీంద్రా ‘కేటీఆర్ ఇలాకాలో ప్రారంభించబోయే మా కే 2 ప్రాజెక్టు సక్సెస్ కాకుండా ఉంటుందా? అని’ అని రిైప్లె ఇచ్చారు. ఆనంద్ మహీంద్రాకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
హరితహారం సూపర్: ఎరిక్ సోల్హిమ్
‘రోడ్ల కూడళ్లలో పచ్చదనం పెంపొందించడం అంత తేలికైన పనికాదు. తెలంగాణలో ఇది సాధ్యమైంది. ఇక్కడ పచ్చదనం పెంపును ఒక ఉద్యమంలా నిర్వహించారు. తద్వారా అన్ని ఇంటర్ జంక్షన్లతో పాటు రోడ్డు మధ్యలోని డివైడర్లు, రోడ్డుకిరువైపులా పచ్చదనం ఉట్టిపడుతున్నది. తెలంగాణ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు’ అని అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారుడు ఎరిక్ సోల్హిమ్ బుధవారం ట్వీట్ చేశారు. ఎరిక్‌కు ఎంపీ సంతోష్‌కుమార్ రిైప్లె ఇస్తూ ‘అవును.. వేరే ఎక్కడైనా సాధ్యం కాదేమో కానీ.. సీఎం కేసీఆర్ లాంటి గొప్ప సంకల్పం ఉన్న నాయకుడి పాలనలో ఉన్న తెలంగాణలో సాధ్యమే. మాకు కేటీఆర్ వంటి మంచి మంత్రి మద్దతు కూడా ఉన్నది’ అని రీట్వీట్ చేశారు.