హైదరాబాద్, జూలై 6 : ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ర్టాల్లో ఆయా ఫలితాలపై ‘సర్’ ప్రభావం కనిపించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఈ పరిస్థితి చూడొచ్చు. పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార టీఎంసీ ఓటమి చెందగా తమిళనాడులో డీఎంకేకూ అదే పరిస్థితి ఎదురైంది. అయితే పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా బీజేపీ 294 స్థానాలకుగానూ 207 సీట్లను గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్లో ‘సర్’అనంతర ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాత్మక విజయం సాధించగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ‘సర్’సమయంలో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించడం, అస్పష్టంగా వేలాది ఓట్లను చేర్చడం వంటివి ఓటర్ల జాబితా జనాభా కూర్పుపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రభుత్వ వ్యతిరేకత, మతపరమైన ధృవీకరణలతోపాటు ఇవి కూడా ఫలితాలను ప్రభావితం చేసినట్లు కనిపిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే 93 శాతానికి పైగా నమోదైన ఓటింగ్ శాతం. ఇది 2021 అసెంబ్లీ ఎన్నికల్లోని 82 శాతం, 2024 లోక్‌సభ ఎన్నికల్లోని 79 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ. దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో సాధారణ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా నమోదైన ఈ 93 శాతం గణాంకం వెనుక తక్కువ ఆధార సంఖ్య(లో బేస్ ఎఫెక్ట్) ప్రభావం ఉంది. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల సంఖ్య సుమారు 91 లక్షల మేర తగ్గింది. 2025 జూన్ 24న కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీఐ) సర్ ప్రక్రియను ప్రకటించిన తర్వాత ఇప్పటికే 13 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో దాదాపు 7.85 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగింపునకు గురయ్యాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే దాదాపు 91 లక్షల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురయ్యాయి.
‘సర్’ ప్రక్రియ ప్రజల హక్కుల తిరస్కరణకు కూడా దారితీయడం గమనార్హం. ‘సర్’లో తొలగింపునకు గురైన వారికి ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని కొత్త బీజేపీ ప్రభుత్వాలు సంక్షేమ ప్రయోజనాలు నిరాకరిస్తున్నాయి. గత నెలలో ‘సర్’ను సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఓటర్ల జాబితాల తయారీ ప్రయోజనం కోసం మాత్రమే ఈసీఐ పౌరసత్వాన్ని ధృవీకరించగలదని, పౌరసత్వ నిర్ధారణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసినప్పటికీ ఇది జరిగింది. ‘సర్’ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో అక్రమ వలసదారులు ఉన్నారనే తమ వాదనను మరింత బలోపేతం చేయడానికి బీజేపీ ఈ ప్రక్రియను ఒక ఆయుధంగా వాడుకొంటున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు కోల్పోయిన వారు సంక్షేమ ప్రయోజనాలతో సహా తమ హక్కులు కోల్పోతున్నారు. మహిళలకు నగదు బదిలీ చేసే అన్నపూర్ణ యోజన పథకంలో సర్‌లో తొలగింపునకు గురైన వారిని చేర్చబోమని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి అనర్హులను తొలగించడానికి ఆదేశించింది. సర్ తర్వాత ఇప్పటికే 22 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసినట్లు బీహార్ సీఎం సమ్రాట్ చౌదరి తెలిపారు.
తమిళనాడులో డీఎంకే అధికారాన్ని కోల్పోయి టీవీకే నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తమిళనాడులో ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85.1 శాతం ఓటింగ్ నమోదైంది. 2021 ఎన్నికల్లో నమోదైన 73.6 శాతం ఓటింగ్‌తో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. దీనికి ప్రధాన కారణం 2025 చివరిలో ఈసీఐ చేపట్టిన ‘సర్’ ప్రక్రియ. సాధారణ అప్డేట్ల మాదిరిగా కాకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ధృవీకరించుకోవడంతో భారీ ప్రక్షాళన జరిగింది. మరణించినవారు, నకిలీలు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారుతోసహా సుమారు 97 లక్షల పేర్లు జాబితా నుండి తొలగింపునకు గురయ్యాయి. ఓటర్ల సంఖ్య 6.7 కోట్ల నుండి 5.73 కోట్లకు తగ్గింది. ఓటర్ల సంఖ్య తగ్గడంతో సహజంగానే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఓటర్ల సంఖ్య తగ్గింపు, భారీ ఓటింగ్ శాతం రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించి టీవీకే కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పించాయి.
‘సర్’ ప్రక్రియ వివిధ రాష్ర్టాల్లో భిన్నమైన విధానాలను అనుసరించింది. బీహార్‌లో ఓటర్లను ఎన్యూమరేషన్ ఫారాలను నింపమని కోరగా పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి వంటి ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో సహా ‘సర్’ నిర్వహించిన 12 రాష్ర్టాలు, యూ టీల్లో ఓటర్లు తమ వివరాలను 2002 నాటి ఓటర్ల జాబితాతో సరిపోల్చుకుని అనుసంధానించుకోవాలని (మ్యాప్) ఈసీఐ కోరింది. పశ్చిమ బెంగాల్లో ఓటర్లు 2002 నాటి మ్యాప్ చేసుకోవడమే కాకుండా తార్కిక వ్యత్యాసం అనే కొత్త ప్రమాణాలతో కూడా పోరాడవలసి వచ్చింది. దీని ఫలితంగా ఓటర్ల సంఖ్య సుమారు 91 లక్షలు తగ్గిపోగా ఎన్నికలకు రెండు వారాల కన్నా ముందు 27 లక్షల మంది ఓటర్లు తమ భవితవ్యం కోసం న్యాయ ట్రిబ్యునళ్లను ఆశ్రయించవలసి వచ్చింది. బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు ‘సర్’ నిర్వహించినప్పటికీ అస్సాంలో మాత్రం ఎన్నికలకు ముందు ఈసీఐ ఈ ప్రక్రియను చేపట్టలేదు. పశ్చిమ బెంగాల్‌లాగే అస్సాం కూడా సరిహద్దు రా ష్ట్రం అయినప్పటికీ అక్కడ కేవలం సంక్షిప్త సవరణ జరిగింది. ప్రస్తుతం ‘సర్’ప్రక్రియ జరుగుతున్న మిగిలిన 16 రాష్ర్టాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ ఒక్కచోటా ఈ ఏడాది ఎన్నికలు జరుగడం లేదు. మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, హర్యానా వంటి రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగి రెండేండ్లు కూడా కాలేదు. ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా సవరణ చేయడం చట్టబద్ధం కాదని బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఏడాది అక్టోబర్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించడం గమనార్హం.