ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16 : యాచకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘట న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్డులో గల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటుచేసుకున్నది. ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. వేరే రాష్ర్టానికి చెందిన యాచకురాలు (60) మూడురోజుల క్రితం ఇబ్రహీంపట్నం ప్రాంతానికి వచ్చింది. పగటి పూట రోడ్లపై యాచిస్తూ సాయంత్రానికి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో తలదాచుకుంటుంది.
సోమవారం అర్ధరాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్టు సీఐ తెలిపారు. బాధితురాలికి వైద్య చికిత్సలు నిర్వహించి వృద్ధాశ్రమంలో చేర్చినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాల ద్వారా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.