అచ్చంపేట (లింగాల), నవంబర్ 3: గొంతులో ఉడకబెట్టిన గుడ్డు ఇరుక్కొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్కు చెందిన తిరుపతయ్య (65) లింగాల మండలం అప్పాయిపల్లిలోని తన బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఆకలి వేయడంతో పక్కనే ఉన్న బజ్జీల బండి వద్ద ఉడకబెట్టిన కోడిగుడ్డు తీసుకొని అప్పాయిపల్లి రోడ్డులోని కమాన్ వద్ద కూర్చొని తింటున్నాడు. గుడ్డు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబసభ్యులకు సమాచారమివ్వగా.. మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి
వంగూరు, నవంబర్ 3 : సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం తుమ్మలపల్లి జీపీ పరిధిలోని మల్లు అనంతరాములు కాలనీలో ఆదివారం చోటుచేసుకున్నది. సంధ్య, రమేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు సత్యదేవ్ (2) ఆదివారం ఇంటి ముం దు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు 108లో కల్వకుర్తిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.
కుంటలో పడి బాలుడు..
మూసాపేట (అడ్డాకుల), నవంబర్ 3 : కుంటలో పడి ఏడేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరులో చోటుచేసుకున్నది. కందూరు గ్రామానికి చెందిన దశరథ, భూదేవికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సాయిరిషి (7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పిల్లలతో కలిసి రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న జంగాలమ్మ కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు సాయిరిషి కుంటలో పడి మునిగిపోయాడు. గమనించిన తోటి పిల్లలు రోధిస్తూ స్థానికులకు తెలపగా.. వారు బయటకు తీసేసరికి ప్రాణాలు కోల్పోయాడు.