రవీంద్రభారతి, ఆగస్టు 1 : ఇటీవల ఇచ్చిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల్లో నిబంధనలు అతిక్రమించి ఉద్యోగోన్నతి పొందిన వీ లచ్చిరెడ్డిపై విజిలెన్స్ డీజీతో విచారణ జరిపించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్ధారకభవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేండ్లకు పైగా విధుల్లోనే లేని లచ్చిరెడ్డికి రూ. కోటికిపైగా వేతనం చెల్లించి, ఉద్యోగోన్నతి ఎలా చేస్తారని ఉన్నతాధికారులను ప్రశ్నించారు.
అర్హులను కాదని లచ్చిరెడ్డికి అవకాశం కల్పించడం సరికాదని మండిపడ్డారు. గత ప్రభుత్వం 2019లో కీసర ఆర్డీవోగా ఉన్న లచ్చిరెడ్డిని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా భూపాలపల్లికి బదిలీ చేసిందని గుర్తుచేశారు. ఆయన గతంలో ఇచ్చిన రాజీనామాను నాటి ప్రభుత్వం ఆమోదించలేదని గుర్తుచేశారు. విధుల్లో చేరని లచ్చిరెడ్డికి డిప్యూటీ కలెక్టర్‌గా ప్రస్తుతం ఎలా ఉద్యోగోన్నతి కల్పిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఈ ఉద్యోగోన్నతిని నిలిపివేసి, అర్హులకు న్యాయలం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బడేసాబ్, వీవీ గౌడ్, సాయిబాబా, సయ్యద్ గూడూషా, గోటూరి రవీందర్‌గౌడ్, బత్తుల జితేందర్, అంజన్నయాదవ్, దివాకర్‌గౌడ్, నరసింహయాదవ్, మల్లేశ్, ధర్మేంద్రసాగర్, అస్కని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజారోగ్యశాఖలో అక్రమ పదోన్నతులపై తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసులో ఏడుగురు అధికారులు, డీజీహెచ్ బదిలీల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుగుతున్న సమయంలోనూ ఉన్నతాధికారుల తీరు మారలేదని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఉన్నతాధికారుల వైఖరితో ఉద్యోగులకు నష్టం జరుగుతున్నదని వాపోయారు. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోవాలని కోరారు.