హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో అంతగా ఆదరణలేని ఆయుష్ విభాగం నేడు మెరుగైన పనితీరును కనబరుస్తున్నది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఫార్మసీలను, డిస్పెన్సరీలను బలోపేతం చేయడంతో క్రమంగా వైద్యసేవలు విస్తరించాయి. ఈ విభాగం ద్వారా ఆయుర్వేద, యోగా, సిద్ధ, హోమియోపతి వైద్య విధానాల్లో ప్రజలకు సేవలు అందుతున్నాయి. నిరుడు ఆయుష్ విభాగం ద్వారా మొత్తం 23 లక్షల మందికిపైగా చికిత్స పొందారు. ప్రతినెలా సగటున దాదాపు 2 లక్షల మంది చికిత్స పొందారు. ప్రభుత్వం ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్య కళాశాలల ద్వారా యూజీ, పీజీ స్థాయిలో నాణ్యమైన విద్యను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆయుష్ పరిధిలో 4 ఆయుర్వేద, 3 హోమియో, 3 యునానీ దవాఖానలు, ఒక నేచురోపతి హాస్పిటల్ ఉన్నాయి. 5 బోధనా దవాఖానలు, ఒక డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్, 440 ఆయుష్ డిస్పెన్సరీలు సేవలందిస్తున్నాయి.
వెల్నెస్ సెంటర్ల సేవలను కొనియాడిన కేంద్ర బృందం
గత ఏడాది కేంద్ర ప్రభుత్వ ఆయుష్ బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. దవాఖానలతోపాటు వెల్నెస్ సెంటర్లను పరిశీలించి సేవలు అద్భుతమని కొనియాడాయి. రాష్ట్రంలో ఆయుష్ విభాగం ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వం నిరుడు అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రజారోగ్యం పెంపునకు గతంలో 492 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాలను పంపి గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నది. ఈ సెంటర్లు ఇప్పటికీ ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాయి.
ట్యాబ్లెట్ల రూపంలో మందులు
గతంలో మందులను పౌడర్ రూపంలో సరఫరా చేసేవారు. దీంతో రోగులకు ఇవ్వడం, వాడకం ఇబ్బందిగా ఉండేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయుష్ పరిశోధనా విభాగాలు, డ్రగ్ టెస్టింగ్ లేబొరేటరీ సంయుక్తంగా ఔషధాలను ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాటి నిల్వ సామర్థ్యం, జీవితకాలం పెరుగడంతోపాటు ప్రజలు సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లి వాడుకునే అవకాశం కలిగింది.