PRLIS | పెద్దఅడిశర్లపల్లి, సెప్టెంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాలమూరు జిల్లా కరువును పారదోలి తెలంగాణకే తలమానికంగా మారుతుందని విశ్రాంత ఇంజినీర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలోని ఏఎమ్మార్పీ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరుతోపాటు డిండి ఎత్తిపోతలను త్వరగా పూర్తి చేస్తే నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. నత్తనడకన సాగుతున్న శ్రీశైలం సొరంగ మార్గం పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని తెలిపారు.
బిల్లు చెల్లింపులు పెండింగ్‌లో లేవని, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే టన్నెల్ పనులు నిలిచిపోయినట్టు చెప్పారు. త్వరలో పెండ్లిపాకల, ఓపెన్ కెనాల్ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మించిన 20 ఏండ్లలో గత పాలకులు నిర్లక్ష్యం వహించినట్టు తెలిపారు. ప్రాజెక్టు రహదారులను ఇరిగేషన్ నుంచి ఆర్‌అండ్‌బీకి బదలాయించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై త్వరలో దేవరకొండలో అఖిలపక్ష పార్టీలతో రిటెర్డ్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆయన వెంట జల సాధన సమాఖ్య అధ్యక్షుడు మునగాల అంజిరెడ్డి ఉన్నారు.