మిర్యాలగూడ, జూన్ 21: ప్రభుత్వ ఏఎమ్మార్పీ వరద కాల్వ (AMRP Canal) అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం వల్ల కాల్వ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా కూడా వరద కాల్వ మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాల్వ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా మారింది.
నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో అంతర్భాగమైన ఎత్తిపోతల పథకాల పరిధిలో చివరి భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ఏఎమ్మార్పీ వరద కాల్వను ఆనాటి ప్రభుత్వం నిర్మించింది. ఈ కాల్వ 83 కిలోమీటర్ల పొడవులో నిర్మించారు. 81 ప్యాకేజీలో 27 డిస్ట్రిబ్యూటరీలు, 110 ప్యాకేజీలో 15 డిస్ట్రిబ్యూటరీలతో పాటు తూములను ఏర్పాటు చేశారు. ఈ కాల్వ ద్వారా పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి, తిప్పర్తి మండలాల పరిధిలో 20 చెరువులను నింపే విధంగా డిజైన్ చేశారు. ఈ విధంగా నేరుగా కాల్వల ద్వారా 80వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 575 అడుగులకు పైగా నీటి మట్టం రాగానే నేరుగా వరద కాల్వకు నీరు మళ్లించే విధంగా డిజైన్ చేశారు. ప్రాజెక్టులో 575 అడుగులకు లోపుగా నీరు ఉన్నట్లయితే పంప్ హౌస్ ద్వారా నీరు ఎత్తిపోసి వరదకాల్వకు నీరు విడుదల చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేసి కాల్వలకు మరమ్మతులు చేయడం వల్ల 80 చెరువుల నుంచి 80వేల ఎకరాల విస్తీర్ణానికి సాగునీరు అంది రైతులు ఆనందంగా ఉన్నారు. ఈనాటి ప్రభుత్వం వరద కాల్వ మరమ్మతులకు నిదులు మంజూరు చేయకపోవడంతో గత ఏడాది కాల్వకు పలుచోట్ల గండ్లు పడి రైతుల పంట పొలాలకు తీవ్ర నష్టం జరిగింది.
కంపచెట్లతో నిండిపోయిన వరద కాల్వ..
వరదకాల్వకు రెండు వైపులా కంపచెట్లు పెరిగిపోయి రైతుల రాకపోకలకు, వాహనాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. కాల్వలో కంపచెట్లు నిండి ఉండడం వల్ల కాల్వ చివరి భాగం అయిన వేములపల్లి మండలం, తిప్పర్తి మండలాల పరిదిలోని భూములకు, చెరువులకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదకాల్వను నమ్ముకోని గత యాసంగి వరి పొలాలు వేసి రైతులు సాగునీరు అందక పంటలు ఎండిపోయి పంటలను మేకలు, గొర్రెలు, పశువులతో మేపేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల కాల్వలకు మరమ్మతులు చేయకపోవడం, ముందు భాగంలో పడిన గండ్లను పూడ్చకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తోపుచర్ల, కుక్కడం, పుచ్చకాయలగూడెం, గండ్రవానిగూడెం, మొల్కపట్నం, మంగాపురం, సల్కునూరు గ్రామాల పరిధిలో పలుచోట్ల పంటలు ఎండిపోయాయి.
గండ్లు పూడ్చి మరమ్మతులు చేయకపోతే చెరువులు నింపడం కష్టమే..
ఏఎమ్మార్పీ వరద కాల్వ ముందు భాగంలో పలుచోట్ల కాల్వ కట్టలు బలహీనంగా మారి గండ్లు పడ్డాయి. వీటిని ఈ వానాకాలం సీజన్ మొదలైంది. కాబట్టి వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తేనే రైతులకు ప్రయోజనం ఉంటుందని రైతులు కోరుతున్నారు. ఈ నెలలోనే కాల్వకట్టలకు మరమ్మతులు నిర్వహించి కంపచెట్లు తొలగించడం, కాల్వలో పూడిక తీయించడం పనులు నిర్వహించి పూర్తి స్థాయిలో చెరువులు నింపే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
వరద కాల్వ మరమ్మతులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలి
ఏఎమ్మార్పీ వరద కాల్వకు ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించి అన్ని చెరువులు నింపే విధంగా చర్యలు చేపట్టాలని మొల్కపట్నంకు చెందిన రైతు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి అన్నారు. వరదకాల్వ కట్టలు రెండు వైపులా సర్కారు కంపచెట్లు పెరిగిపోయి నీరు కిందికి వచ్చే విధంగా లేదు. ఒకవైపు పూడిక, మరోవైపు కంపచెట్ల వల్ల తరుచుగా గండ్లు పడుతున్నాయి. వెంటనే మరమ్మతులు నిర్వహించి ఈ వానాకాలం అన్ని చెరువులు నిండే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలి.