హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఆమె హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీజాయింట్ కమిషనర్‌గా, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
వీటికి అదనంగా రెండు బాధ్యతలు అప్పగించడంతో పనిచేసేందుకు వీలుగా వేర్వేరు చోట్ల ఉన్న కార్యాలయాలను ఒకే చోటికి తరలిస్తున్నారు. తార్నాకలో ఉన్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయాన్ని నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలోకి మారుస్తున్నారు. అందులోనే ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు కార్యకలాపాలు, హెచ్‌జీసీఎల్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, అక్కడే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మూడు కార్యాలయాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు.